Uppal Stadium | హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 12న ఇండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే టీ-20 క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో స్థానిక డీసీపీలు, ఏసీపీలతో పాటు జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ, ఎలక్ట్రిసిటీ విభాగాలు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి బందోబస్తుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాలైన సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకుంటూ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం గొప్ప అవకాశమని, ఎన్ని సవాళ్లు ఎదురైనా తగిన విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. టిక్కెట్ల పంపిణీలో ఎలాంటి గందరగోళం లేకుండా చూడాలని నిర్వహణ బృందానికి ఆయన సూచనలు చేశారు.
ప్రేక్షకుల కోసం అవసరమైన పార్కింగ్ ఏర్పాట్లు, సాధారణ పౌరుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నకిలీ టిక్కెట్లను ఎవరైనా అమ్మితే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, టిక్కెట్ల పంపిణీ పూర్తిగా పారదర్శంగా జరుగుతుందని, ఎటువంటి పుకార్లు నమ్మవద్దని సీపీ సూచించారు. ఈ సమీక్షలో డీసీపీలు పద్మజ, కరుణాకర్, అరవింద్ బాబు, రమణారెడ్డి, ఉషా విశ్వనాథ్‌లతో పాటు హెచ్సీయు అధ్యక్షుడు జగన్మోహన్రావు, ఉపాధ్యక్షుడు దల్జీర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
SHE Teams | మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన 200 మందికి జైలు శిక్ష
Posani Krihsna Murali | బాలకృష్ణకు వ్యతిరేకంగా పోసాని సంచలన వ్యాఖ్యలు..!