జైపూర్: కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ‘మీరు రక్తపు కన్నీరు కారుస్తారు’ అని హెచ్చరించారు. (You’ll Shed Tears Of Blood) రాజస్థాన్లోని బుండి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ చందనా బుధవారం కోటాలో జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజస్థాన్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నదని ఆరోపించారు. ‘ఈ ప్రభుత్వం త్వరలో మారుతుంది. కాబట్టి ఎవరి ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలను వారు (పోలీసులు) ఇబ్బంది పెట్టకూడదు. వారు ఎంతగా హింసిస్తారో.. అంతగా రక్తంతో కన్నీళ్లు పెట్టుకుంటారు’ అని పోలీసులను హెచ్చరించారు.
కాగా, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అశోక్ చందనా వ్యాఖ్యలపై రాజస్థాన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి మోతీ లాల్ మీనా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలీసు, రెవెన్యూ అధికారులను పిలిపించి వారి పార్టీ పని కోసం వినియోగించారని విమర్శించారు. అయితే ఇప్పుడు పరిపాలన కోసం, ప్రజల మేలు కోసం అధికార యంత్రాంగం పని చేస్తోందని తెలిపారు. బీజేపీ సుపరిపాలనకు ఇది ఒక ఉదాహరణ అని అన్నారు. ‘ఇది స్పష్టంగా కాంగ్రెస్కు బాగా నచ్చదు. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఆదేశం లేకపోతే ఆ పార్టీ ఏమి చెబుతుంది. అప్పుడు స్థానిక నాయకుల నుంచి మీరు ఏమి ఆశిస్తారు?’ అని మండిపడ్డారు.