బెంగళూరు: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబై 5 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్‌పై అద్భుత విజయం సాధించింది. ఎంపీ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. 47 పరుగులకే పృథ్విషా(10), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(16) వికెట్లు కోల్పోయిన ముంబైని సీనియర్లు సూర్యకుమార్‌యాదవ్(48), రహానే(37) ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 52 పరుగులు జతచేశారు. అయితే 14.4 ఓవర్లలో ముంబై 129 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది.
ఈ తరుణంలో సూర్యాంశ్ శెడ్జె(15 బంతుల్లో 36 నాటౌట్), అథర్వ(16 నాటౌట్) చెలరేగడంతో ముంబై గెలుపు వాకిట నిలిచింది. త్రిపురేశ్సింగ్(2/34) రెండు వికెట్లు తీశాడు. తొలుత కెప్టెన్ రజత్ పాటిదార్(40 బంతుల్లో 81 నాటౌట్, 6ఫోర్లు, 6సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో ఎంపీ 20 ఓవర్లలో 174/8 స్కోరు చేసింది. పాటిదార్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. శార్దుల్, రోస్టన్ రెండేసి వికెట్లు తీశారు. సూర్యాంశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, రహానే ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దక్కింది.