బహ్రెయిన్, మార్చి 4: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధం.. అక్కడ చిక్కుకున్న భారత టూరిస్టులను ఊహించని కష్టాల్లో నెట్టింది. మందుల్లేవ్.. డబ్బుల్లేవ్.. అంటూ అనేకమంది తెలుగువాళ్లు సాయం కోసం భారత ప్రభుత్వాన్ని, రెండు తెలుగు రాష్ర్టాల్ని వేడుకుంటున్నారు. ఒక్క పూట భోజనం, టూ-రూమ్ బెడ్రూమ్లో తామంతా అష్టకష్టాలు పడుతున్నామని టూరిస్టుల్లో ఒకరు బుధవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఫిబ్రవరి 24న తెలంగాణ, ఆంధప్రదేశ్ నుంచి టూరిస్ట్ వీసాపై బహ్రెయిన్‌కు వెళ్లిన వీళ్లంతా ఫిబ్రవరి 28న భారత్‌కు తిరిగి రావాల్సి ఉంది.
యుద్ధం కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వాళ్ల దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. ముఖ్యంగా పెద్దవాళ్లలో బీపీ, షుగర్ వ్యాధితో బాధపడేవాళ్లు.. మందుల్లేక, డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. బహ్రెయిన్‌లోని భారత ఎంబసీ నుంచి సరైన స్పందనేదీ రావటం లేదని వాపోయారు. తమను వెంటనే స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని, రెండు తెలుగు రాష్ర్టాల సీఎంలను కోరారు.