జైపూర్: కెప్టెన్ తిలక్ వర్మ (58 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో రాణించడంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో జమ్ము కశ్మీర్‌ను చిత్తుచేసింది. మొదట జమ్ము కశ్మీర్ 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో హైదరాబాద్ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 160 రన్స్ చేసింది. తిలక్‌తో పాటు రోహిత్ రాయుడు (38), రాహుల్ సింగ్ (35) రాణించారు.
మరో మ్యాచ్‌లో పంజాబ్ రికార్డు స్కోరుతో ఆంధ్రప్రదేశ్‌పై విజయం సాధించింది. పంజాబ్ 6 వికెట్లకు 275 పరుగులు చేసింది. భారత దేశీయ టీ20ల్లో ఇదే అత్యధికం. అభిషేక్ శర్మ (51 బంతుల్లో 121; 9 ఫోర్లు, 9 సిక్సర్లు), అన్మోల్ప్రీత్ (26 బంతుల్లో 87; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) దంచికొట్టారు. అనంతరం ఆంధ్ర 20 ఓవర్లలో 170/7కే పరిమితమైంది. రికీ భూయ్ (52 బంతుల్లో 104 నాటౌట్; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీ వృథా అయింది. మరో మ్యాచ్‌లో అశుతోష్ శర్మ 11 బంతుల్లో హాఫ్‌సెంచరీ చేసి యువరాజ్ సింగ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ (12 బంతుల్లో) రికార్డు బ్రేక్ చేశాడు.