Suryakumar Yadav : టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తొలి సిరీస్‌లోనూ హిట్ కొట్టాడు. శ్రీలంక గడ్డపై 3-0తో భారత్‌కు పొట్టి సిరీస్ అందించిన ఉత్సాహంలో ఉన్న సూర్య టెస్టు క్రికెట్‌పై మనసు పెడుతున్నాడు. త్వరలో జరుగబోయే బుచ్చిబాబు టోర్నమెంట్ (Buchi Babu)లో మహరాష్ట్ర తరఫున మిస్టర్ 360 బరిలోకి దిగనున్నాడు.
ఈ సందర్భంగా మాట్లడిన సూర్య తన మనసులోని మాట బయటపెట్టాడు. టీ20లకే పరిమితం కాకుండా మూడు ఫార్మాట్లకు ఆడడంపై దృష్టి పెడుతున్నట్టు చెప్పాడు. ‘నాకు భారత జట్టు తరఫున అన్ని ఫార్మాట్లకు ఆడాలని ఉంది. టెస్టు క్రికెట్ ఆడేందుకు బుచ్చిబాబు టోర్నమెంట్ పనికొస్తుందని నా నమ్మకం’ అని సూర్య తెలిపాడు. ఇదే విషయాన్ని ఈ చిచ్చరపిడుగు ముంబై చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్(Sanjay Patil)తోనూ చెప్పాడు.
‘సూర్య నాకు ఫోన్ చేసి బుచ్చిబాబు టోర్నీలో ఆడాలని అనుకుంటున్నా అని అన్నాడు. సూర్య రాకతో ముంబై జట్టు మరింత బలోపేతం కానుంది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ టోర్నీ రెండో మ్యాచులో సూర్య ఆడే అవకాశముంది’ అని సంజయ్ వెల్లడించాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సూర్యకు మంచి రికార్డే ఉంది. 137 ఇన్నింగ్స్‌ల్లో ఈ చిచ్చరపిడుగు ఏకంగా 14 సెంచరీలు, 29 అర్ధ శతకాలు బాదేశాడు. మొత్తంగా 63.74 స్ట్రయిక్ రేటుతో అతడు 5,628 పరుగులు సాధించాడు. దాంతో, మళ్లీ రెడ్ బాల్ క్రికెట్లో సత్తా చాటేందుకు సూర్య ఆతృతగా ఉన్నాడు. ఒకవేళ బుచ్చిబాబు టోర్నీలో దంచికొట్టాడంటే మళ్లీ టెస్టు జెర్సీ వేసుకొనే అవకాశముంది.
Surya dada back on home turf! 🤩💪#MCA #Mumbai #Cricket #Wankhede #BCCI | @surya_14kumar pic.twitter.com/v9mOGGVZmN
— Mumbai Cricket Association (MCA) (@MumbaiCricAssoc) August 9, 2024
అయితే.. ఇప్పటికే వన్డేల్లో తేలిపోతున్న సూర్, నిరుడు స్వదేశంలో బోర్డర్ – గవాస్కర్ (Border – Gavaskar) ట్రోఫీకి ఎంపికయ్యాడు. కానీ, పేలవైమన ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులతో ఉసూరుమనిపించి జట్టులో చోటు కోల్పోయాడు.