Suryakumar Yadav : పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) పేరు దేశమంతా మార్మోగిపోతోంది. ‘అబ్బా.. ఏం క్యాచ్ పట్టాడురా.. అద్భుతమైన క్యాచ్’ అంటూ ఇప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మిస్టర్ 360 ఆటగాడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
‘టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆ క్యాచ్ అందుకొని నిన్నటికి ఎనిమిది రోజులు. కానీ, ఎనిమిదేండ్ల క్రితమే నేను ముఖ్యమైన క్యాచ్ పట్టాను. అవును ఎనిమిదేండ్ల క్రితం. ఇంకా ఎన్నో ఏండ్లు రాబోతున్నాయి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. తన 8వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సూర్య ఈ పోస్ట్ పెట్టాడు. తనను ఎంతో ప్రేమించే.. తనకు ఎంతో మద్దతుగా నిలిచే భార్య దేవిశ శెట్టి (Devisha Shetty) గురించి మనోడు అంత గొప్పగా చెప్పాడు మరీ. సూర్య, దేవిశలు 2016 జూలై 7న పెండ్లి చేసుకున్నారు.
టీ20 స్పెషలిస్ట్ అయిన సూర్య.. పొట్టి ప్రపంచ కప్‌లో వరుస అర్ధ శతకాలతో జట్టును ఆదుకున్నాడు. అంతేకాదు కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన ఫైనల్లో అతడు చరిత్రలో నిలిచిపోయే క్యాచ్ పట్టాడు. దక్షిణాఫ్రికా (South Africa)తో జరిగిన ఫైనల్లో ఆద్యంతం ఉత్కంఠ నెలకొన్న సమయంలో బౌండరీ వద్ద సూపర్ క్యాచ్ అందుకున్నాడు.
హార్దిక్ పాండ్యా వేసిన 20వ ఓవర్ తొలి బంతికి డేవిడ్ మిల్లర్ (David Miller) లాంగాన్‌లో భారీ షాట్ ఆడాడు. అక్కడే కాచుకొని ఉన్న సూర్య.. పరుగెత్తుతూ వెళ్లి బంతిని పట్టుకున్నాడు. అయితే.. బౌండరీ లైన్ దాటుతున్నాని తెలిసి తెలివిగా బంతిని బయటకు విసిరాడు. ఆ తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టి క్యాచ్ పూర్తి చేశాడు. అంతే.. ఆ క్షణం భారత క్రికెటర్లతో పాటు స్టేడియంలోని అభిమానులంతా సంబురాల్లో మునిగిపోయారు. మిల్లర్ వికెట్‌తో సఫారీల ఓటమి ఖరారవ్వగా.. ఆఖరి బంతికి ఒకే ఒక్క పరుగు రావడంతో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది.