Manchu Vishnu | డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి బయటికి వచ్చిన టాలీవుడ్ నటి హేమ నేడు మా అధ్యక్షుడు మంచు విష్ణుని కలిశారు. తనను మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) నుంచి సస్పెండ్ చేయడంపై అభ్యంతరం తెలుపుతూ విష్ణుకి ఒక లేఖ రాశారు. వెంటనే సస్పెన్షన్ను ఎత్తివేయాలని లేఖలో హేమ విజ్ఞప్తి చేశారు. తనను సస్పెండ్ చేయడంలో మా నిబంధనలు పాటించలేదని పేర్కోన్నారు. రూల్స్ ప్రకారం నన్ను సస్పెండ్ చేయాలంటే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని గుర్తు చేశారు. షోకాజు నోటీసు ఇవ్వకుండా, తన వివరణ కోరకుండా సభ్యత్వం నుండి ఎలా తొలగిస్తారు అని అడిగారు. మళ్ళీ తన సభ్యత్వాన్ని పునరుద్దరించాలని కోరారు.
రేవ్ పార్టీలో పాల్గోన్నానని తనపై తప్పుడు ప్రచారం జరిగిందని పేర్కోన్నారు. దోషిగా తేలేదాక అందరూ నిర్దోషులే అని అప్పట్లో విష్ణు చెప్పిన మాటలను గుర్తు చేశారు. తనపై ఆరోపణలపై పోలీసులు ఎటువంటి ఆధారలు చూపించలేకపోయారని.. అందుకే ఈ కేసులో కోర్టు కూడా తనకు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. మా సభ్యత్వాన్ని తొలగించడం అంటే తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అని తెలిపారు.