Suryakumar Yadav : శ్రీలంక పర్యటనకు భారత టీ20 సారథిగా ఎంపికైన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తొలిసారి స్పందించాడు. సోషల్ మీడియా సైట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా మిస్టర్ 360 ఆటగాడు అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు. అంతేకాదు దేవుడు చాలా గొప్పవాడంటూ సూర్య తన పోస్ట్‌ను ముగించాడు. తనపై ఫ్యాన్స్ అభిమానం, ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నట్టు సూర్య తెలిపాడు.
‘నాపై ప్రేమ చూపిస్తూ, నాకు మద్ధతుగా నిలుస్తూ.. నాకు అభినందనలు తెలిపిన మీకు ధన్యవాదాలు. గత కొన్ని వారాలు నా కలకు ఏమాత్రం తక్కువ కాదు. దేశానికి ఆడడం ఎంత గొప్ప అనుభూతిని ఇస్తుందో మాటల్లో వర్ణించలేను. టీ20 సారథిగా కొత్త పాత్ర నాపై మరింత బాధ్యతను, నాలో ఉత్సుకతను పెంచింది. మీ ప్రేమ, మద్దతు నాకు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నా. ఈ గౌరవం, ఘనత అంతా దేవుడికే చెందుతుంది. దేవుడు గొప్పవాడు’ అంటూ సూర్య తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
వన్డే వరల్డ్ కప్ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌కు.. అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనలోనూ పొట్టి ఫార్మాట్‌కు సూర్య సారథిగా వ్యవహరించాడు. మరోవైపు పాండ్యా సైతం టీ20 కెప్టెన్‌గా లంక సిరీస్, బంగ్లాదేశ్ సిరీస్‌లో హిట్ కొట్టాడు. కానీ, సెలెక్టర్లు మాత్రం టీ20 లో రాటుదేలిన సూర్యకే లంక సిరీస్ బాధ్యతలు అప్పగించేందుకు ఆసక్తి చూపారు.
హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ సూర్య నేతృత్వంలో భారత జట్టు మూడు టీ20ల సిరీస్ కోసం శ్రీలంకకు వెళ్లనుంది. జూలై 27వ తేదీన పల్లెకెలే స్టేడియంలో తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. అనంతరం ఆగస్టు 2న వన్డే సిరీస్‌లో ఇరుజట్లు తలపడనున్నాయి. టీ20 స్పెషలిస్ట్ అయిన సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ కప్ హీరో అయ్యాడు. కరీబియన్ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో సూర్య మెరుపు క్యాచ్ అందుకున్నాడు. డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద బ్యాలెన్స్ చేసుకుంటూ పట్టేశాడు. అంతే.. యావత్ భారతాన్ని సంబురాల్లో ముంచెత్తాడు.