Bajaj Bikes – Flipkart | ఇప్పటి వరకూ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ ద్వారా స్మార్ట్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఆన్లైన్లో ఆర్డర్ చేసేవారం. ఇప్పుడు ఈ వాల్ మార్ట్ అనుబంధ సంస్థ ఫ్లిప్ కార్ట్.. ఆటోమొబైల్ రంగంలోకి ప్రవేశిస్తోంది. అందునా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటోతో ఫ్లిప్ కార్ట్ మధ్య అవగాహన కుదిరింది. ఫ్లిప్ కార్ట్ సహకారంతో బ్రాండ్ ఓమ్నీ చానల్ దిశగా ఒక అడుగు ముందుకేశామని బజాజ్ ఆటో తెలిపింది.
మోటారు సైకిళ్ల కొనుగోళ్లు సింపుల్‌గా, క్విక్ గా సాగేందుకు బజాజ్ ఆటోకు గల విస్తృత నెట్ వర్క్‌కు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆన్ లైన్ ఆర్డర్స్ జత కలుస్తుందని తెలిపింది. తమ బ్రాండ్ కింద తయారవుతున్న మోటారు సైకిళ్లన్నీ ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆన్ లైన్ లోనూ విక్రయిస్తామని బజాజ్ ఆటో శుక్రవారం ప్రకటించింది. పల్సర్, డామినర్, అవెంజర్, ప్లాటినా, సీటీ వంటి మోడల్ మోటారు సైకిళ్లనూ ఆన్ లైన్ లోనూ కొనుగోలు చేయొచ్చునని తెలిపింది.
వాటి ధరలు రూ.69 వేల నుంచి ప్రారంభమై రూ.2.31 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతాయని తెలిపింది. దేశంలోని 25 ప్రధాన నగరాల్లో జీవిస్తున్న వారు ఫ్లిప్ కార్ట్ ద్వారా బజాజ్ మోటారు సైకిళ్లు బుక్ చేసుకోవచ్చు. మిగతా నగరాలను దశల వారీగా చేరుస్తామని బజాజ్ ఆటో తెలిపింది. తాజాగా మార్కెట్లోకి రిలీజ్ చేసిన సీఎన్జీ మోటారు బైక్ ‘బజాజ్ ఫ్రీడమ్ 125’ కొంత కాలం తర్వాత ఫ్లిప్ కార్ట్ జాబితాలో జత కలుపుతామని వెల్లడించింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేసే వారికి స్పెషల్ ఆఫర్ కింద రూ.5000 వరకూ ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందిస్తామని తెలిపింది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుందని వెల్లడించింది బజాజ్ ఆటో.