అభినవ డివిలియర్స్‌గా మన్ననలందుకుంటున్న సూర్యకుమార్ యాదవ్.. సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగిన వేళ న్యూజిలాండ్‌పై టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. మైదానం నలువైపులా సూర్య కొట్టిన షాట్లతో మౌంట్ మాంగనీ మోతెక్కిపోగా.. యంగ్ ఇండియా సిరీస్‌లో బోణీ కొట్టింది. పొట్టి ఫార్మాట్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న సూర్య.. స్థాయికి తగ్గ రీతిలో వీరంగ మాడగా.. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు.
మౌంట్ మాంగనీ: అందివచ్చిన అవకాశాలను రెండు చేతులతో ఒడిసి పడుతూ.. అనతి కాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 111 నాటౌట్; 11 ఫోర్లు, 7 సిక్సర్లు).. అజేయ శతకంతో కదం తొక్కడంతో భారత జట్టు ఘన విజయం నమోదు చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా 65 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. ఈ ఫలితంతో హార్దిక్ సేన సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 రన్స్ చేసింది. మూడో స్థానంలో బరిలోకి దిగిన సూర్యకుమార్ అజేయ సెంచరీతో విజృంభించగా.. ఓపెనర్ ఇషాన్ కిషన్ (36) పర్వాలేదనిపించాడు. నయా ఓపెనర్ రిషబ్ పంత్ (6)తో పాటు శ్రేయస్ అయ్యర్ (13), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (13), దీపక్ హుడా (0), వాషింగ్టన్ సుందర్ (0) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అతడు వరుసగా పాండ్యా, హుడా, సుందర్‌ను ఔట్ చేశాడు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (61) ఒంటరి పోరాటం చేయగా.. అలెన్ (0), ఫిలిప్స్ (12), మిషెల్ (10), నీషమ్ (0), శాంట్నర్ (2) విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీపక్ హుడా 4, మహమ్మద్ సిరాజ్, చాహల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సూర్యకుమార్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మంగళవారం నేపియర్‌లో మూడో మ్యాచ్ జరుగనుంది.
దంచుడే దంచుడు..
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమితో డీలా పడ్డ భారత జట్టు.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో యువ ఆటగాళ్లకు చాన్స్ ఇచ్చింది. రోహిత్, కోహ్లీ, రాహుల్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా జట్టుకు సారథ్యం వహిస్తుండగా.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బంతి ఎక్కడేసినా.. దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్న రీతిలో దంచికొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. మెగాటోర్నీలో ఓపెనర్ల ఆటతీరు వల్లే భారత్ మూల్యం చెల్లంచుకుందనే అపవాదుల మధ్య మరోసారి మన ఓపెనర్లు పేలవ ప్రదర్శన కనబర్చారు. ఇషాన్ కిషన్ వన్డే తరహాలో బంతికో పరుగు చొప్పున రాబట్టగా.. కుదురుకునేందుకు ఎక్కువ సమయం తీసుకున్న పంత్.. ఆరో ఓవర్లో ఔటయ్యాడు. మ్యాచ్‌కు కాసేపు వర్షం ఆటంకం కలిగించగా.. అక్కడి నుంచి సూర్య దంచుడు ప్రారంభమైంది. మధ్య ఓవర్లలో న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో మనవాళ్లను కట్టడి చేయగా.. ఇషాన్, శ్రేయస్ వికెట్లు కోల్పోయారు. ఫలితంగా 15 ఓవర్లు ముగిసేసరికి టీమ్ఇండియా 119/3తో నిలిచింది. ఇక అక్కడి నుంచి గేర్లు మార్చిన సూర్య.. 32 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయిన ఈ ‘360 డిగ్రీస్ ప్లేయర్’ సౌథీ ఓవర్లో 6,4,4 అరుసుకున్నాడు. మిల్నే ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన సూర్య.. ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్లో 22 పరుగులు రాబట్టాడు. 4,4,4,4,6తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20 క్రికెట్లో సూర్యకు ఇది రెండో శతకం కావడం విశేషం. ఆఖరి బంతికి సూర్య కొట్టిన సిక్సర్ మ్యాచ్‌కే హైలెట్. డీప్ థర్డ్‌మ్యాన్ వైపు ఆడిన ఆ షాట్ చూసి తీరాల్సిందే. సూర్య చివరి 64 పరుగులను కేవలం 18 బంతుల్లోనే సాధించాడంటే అతడి జోరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ జోష్‌లో జట్టు స్కోరు మరింత పెరగడం ఖాయం అనుకున్న దశలో ఆఖరి ఓవర్లో సూర్య నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌కే పరిమితం కాగా.. సౌథీ హ్యాట్రిక్ నమోదు చేసుకున్నాడు. భారీ లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ కనీస పోరాటం కనబర్చలేకపోయింది. కేన్ విలియమ్సన్ మినహా ఏ ఒక్క ఆటగాడు క్రిజులో నిలదొక్కుకోలేకపోవడంతో కివీస్‌కు పరాజయం తప్పలేదు. 19 ఓవర్లో హుడా మూడు వికెట్లు ఖాతాలో వేసుకొని న్యూజిలాండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 191/6 (సూర్యకుమార్ 111 నాటౌట్, ఇషాన్ 36; సౌథీ 3/34, ఫెర్గూసన్ 2/49), న్యూజిలాండ్: 18.5 ఓవర్లలో 126 ఆలౌట్ (విలియమ్సన్ 61; హుడా 4/10, సిరాజ్ 2/24).