ముంబై, సెప్టెంబర్ 16 : సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించటంలో విఫలమైనందుకు మహారాష్ట్ర ఎన్నికల సంఘం తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలన్నింటికీ 2026 జనవరి 31లోగా ఎన్నికలు నిర్వహించాలని మహారాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు తీర్పు వెలువరించింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కోర్టు నిర్దేశించిన మునుపటి షెడ్యూల్‌ను పాటించటంలో విఫలమైనందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టింది.
ఎన్నికల షెడ్యూల్‌ను మరోసారి పొడిగించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి, ఈసీకి ఇచ్చేది లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అలాంటి అభ్యర్థనలను తాము వినదలచుకోలేదని పేర్కొన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న డీలిమిటేషన్ కసరత్తును అక్టోబర్ 31లోగా ముగించాలని, దీనిని సాకుగా చూపుతూ ఎన్నికలను వాయిదా వేస్తామంటే కుదరదని ధర్మాసనం తెలిపింది. నాలుగు వారాల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలపై నోటిఫికేషన్ జారీచేయాలని, నాలుగు నెలల్లో ఎన్నికలను పూర్తిచేయాలని మే నెలలో సుప్రీంకోర్టు మహారాష్ట్ర ఈసీని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఈసీ పాటించకపోవటంపై సుప్రీంకోర్టు నేడు అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఎన్నికల నిర్వహణకు ఎంత సిబ్బంది అవసరమో.. ఆ వివరాల్ని ఈసీ, రెండు వారాల్లో రాష్ట్ర సీఎస్‌కు అందజేయాలని, ఆ మేరకు నాలుగు వారాల్లో సీఎస్ సిబ్బందిని అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. సరిపడా ఈవీఎంలు సేకరించాలని, వీటిపై నవంబర్ 30లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్లపై కోర్టు వ్యాజ్యం కారణంగా 2022 నుంచి మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి.