Sunil Gavaskar : ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమైన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) పుత్రోత్సాహంలో మునిగితేలుతున్నాడు. విరాట్ భార్య అనుష్క శర్మ(Anushka Sharma) ఇటీవలే లండన్‌లో మగబిడ్డ ‘అకాయ్’కు జన్మనిచ్చింది. దాంతో, అక్కడే ఉండిపోయిన కోహ్లీ కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. అయితే.. అతడు భారత్‌కు ఎప్పుడు వస్తాడు? జట్టుతో ఎప్పుడు కలుస్తాడు? అనేది ఎవరికీ తెలియడం లేదు. బీసీసీఐ కూడా కోహ్లీ రీ-ఎంట్రీపై ఇప్పటివరకూ ప్రకటన చేయలేదు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన కోహ్లీ ఐపీఎల్ 17వ సీజన్లోనూ కూడా ఆడకపోవచ్చని అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 16వ సీజన్ మాదరిగానే 17వ సీజన్లోనూ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తాడా? అనే ప్రశ్నకు గవాస్కర్ సరదాగా జవాబిచ్చాడు. కోహ్లీ ఆడుతాడా? లేదా తెలియదు. కొన్ని కారణాల వల్ల అతడు క్రికెట్ ఆడడం లేదు. బహుశా ఐపీఎల్‌లోనూ విరాట్ ఆడకపోవచ్చు అని గవాస్కర్ వెల్లడించాడు.
ధ్రువ్ జురెల్
అంతేకాదు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ధ్రువ్ జురెల్(Dhruv Jurel)ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపాలని గవాస్కర్ సూచించాడు. ‘ఇంగ్లండ్‌పై రాంచీ టెస్టులో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన జురెల్ సూపర్ స్టార్ అయిపోయాడు. పేసర్ ఆకాశ్ దీప్‌కి కూడా ఆర్సీబీ మరిన్ని చాన్స్‌లు ఇవ్వాలి. అతడిని డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా ఉపయోగించుకోవాలి హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) కెప్టెన్‌గా ఎంపికైనందున రోహిత్ శర్మను బ్యాటర్‌గా ఆడించాలి. దాంతో, టీ20 వరల్డ్ కప్ముందు అతడికి మంచి ప్రాక్టీస్ లభిస్తుంది’ అని లిటిల్ మాస్టర్ అభిఫ్రాయపడ్డాడు.
గవాస్కర్, కోహ్లీ, అనుష్క శర్మ
గతంలో విరాట్ ఫామ్‌లేమితో బాధపడుతున్నసమయంలోనూ గవాస్కర్ ఇలానే సరదా వ్యాఖ్యలతో విమర్శలపాలయ్యాడు. అనుష్క బంతులతో కోహ్లీ ప్రాక్టీస్ చేశాడంతే అని కామెంట్ చేసి అభిమానుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసింది. ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22న షురూ కానుంది. ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.