కటక్ : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పొట్టి పోరుకు వేళయైంది. ఇరు జట్ల ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు మంగళవారం కటక్‌లో తెరలేవనుంది. స్వదేశం వేదికగా ఫిబ్రవరిలో టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌ను రెండు జట్లు సన్నాహకంగా భావిస్తున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సొంత ఇలాఖాలో సత్తాచాటేందుకు టీమ్ఇండియా తహతహలాడుతున్నది. మెగాటోర్నీ నాటికి తుది జట్టుపై ఓ స్పష్టమైన అవగాహనకు వచ్చేందుకు సఫారీ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ చూస్తున్నది. టెస్టు సిరీస్ వైట్‌వాష్‌ను మరిపిస్తూ వన్డే సిరీస్‌ను ఖాతాలో వేసుకున్న భారత్ అదే జోరులో పొట్టి సిరీస్‌ను దక్కించుకునేందుకు పట్టుదలతో ఉంది. సూర్యకుమార్‌యాదవ్ కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న భారత్ అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచిస్తున్నది. ముఖ్యంగా గాయాల నుంచి పూర్తిగా తేరుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ శుభ్‌మన్‌గిల్ రీఎంట్రీ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆసియాకప్ టోర్నీ తర్వాత జాతీయ జట్టుకు దూరమైన హార్దిక్..ఇటీవలి సయ్యద్ ముస్తాక్‌అలీ టీ20 టోర్నీలో బరోడా తరఫున ఆకట్టుకున్నాడు. అటు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించాడు. పూర్తి ఫిట్నెస్తో కనిసిస్తున్న హార్దిక్ చేరికతో జట్టు కాంబినేషన్ మారనుంది. మరోవైపు సఫారీలతో టెస్టు సిరీస్‌లో మెడనొప్పితో జట్టుకు దూరమైన గిల్ రాకతో టాపార్డర్ బలోపేతం కానుంది.
హార్డ్ హిట్టింగ్ ఓపెనర్ అభిషేక్‌శర్మ జతగా గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. తమదైన రోజున ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో బ్యాటు ఝులిపించే అభిషేక్‌కు గిల్ తోడైతే పరుగుల వరద పారినట్లే. కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్‌పై ఆందోళన కొనసాగుతున్నది. గత ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున 717 పరుగులతో అదరగొట్టిన సూర్యకుమార్ పూర్తిస్థాయి కెప్టెన్‌గా మారిన తర్వాత గత 15 ఇన్నింగ్స్‌లో 15.33 సగటుతో కేవలం 184 పరుగులకే పరిమితమయ్యాడు. గత 20 మ్యాచ్‌ల నుంచి కెప్టెన్ ఒక్కసారి కూడా అర్ధసెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు. గతంలో 187గా ఉన్న స్ట్రైక్‌రేట్ ప్రస్తుతం 127కు పడిపోయింది. వికెట్‌కీపర్, బ్యాటర్ కోసం సంజూ శాంసన్, జితేశ్శర్మ మధ్య పోటీ కొనసాగుతున్నది. గత ఆసీస్ సిరీస్‌లో శాంసన్‌ను పక్కకుపెట్టి జితేశ్‌కు అవకాశమివ్వడం కొత్త ఆలోచనలకు తెరతీసింది. ఓపెనర్‌గా మూడు సెంచరీలు చేసిన శాంసన్..గిల్ రాకతో మిడిలార్డర్‌కు పరిమితం కావాల్సి వచ్చింది. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసే సామర్థ్యం కల్గిన శాంసన్..జితేశ్ నుంచి పోటీ ఎదుర్కొంటున్నాడు. ఈ సిరీస్‌లో మేనేజ్మెంట్ ఎవరి వైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
దీటైన పోటీకి : టెస్టు సిరీస్ వైట్‌వాష్ చేసి వన్డే సిరీస్ చేజార్చుకున్న దక్షిణాఫ్రికా..పొట్టి పోరులో దీటైన పోటీనిచ్చేందుకు తహతహలాడుతున్నది. మార్క్మ్ నేతృత్వంలో బరిలోకి దిగుతున్న సఫారీలు..మెగాటోర్నీకి ఈ సిరీస్‌ను సన్నాహకంగా తీసుకుంటున్నది. గత ప్రపంచకప్ తర్వాత తొలిసారి జట్టులోకి వచ్చిన సీనయర్ పేసర్ నోకియా..సఫారీల పేస్ దళాన్ని ముందుకు నడిపించనున్నాడు. గాయాలతో ఇప్పటికే టోనీ డీ జార్జ్, కెవాన్ ఫకా జట్టుకు దూరం కాగా, కేశవ్ మహారాజ్, యాన్సెన్ జట్టుకు కీలకం కానున్నారు.