Ashes Series : యాషెస్(Ashes) రెండో టెస్టులో వరల్డ్ నంబర్ 1 ఆస్ట్రేలియా(Australia) ఘన విజయం సాధించింది. లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌ను 43 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. బౌలర్లు చెలరేగడంతో అతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 327 పరుగులకే కుప్పకూలింది. అయితే.. బెన్ స్టోక్స్(155 : 214 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) వీరోచిత సెంచరీతో భయపెట్టినా ఆఖరికి ఆసీస్‌దే పై చేయి అయింది. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ తలా మూడేసి వికెట్లతో రాణించారు. వరుసగా రెండో విజయంతో ప్యాట్ కమిన్స్ సేన 5 టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఇంగ్లండ్‌కు సొంత గడ్డపై రెండో టెస్టులోనూ భంగపాటు తప్పలేదు. టెస్టుల్లో బాజ్‌బాల్(Bazz Ball) ఆటతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించాలనుకున్నఆ జట్టు ఆస్ట్రేలియా దెబ్బకు కుదేలైంది. ఓవర్ నైట్ స్కోర్ 115 తో ఐదో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ మ్యాచ్ గెలిచేలా కనిపించింది. బెన్ డకెట్(83), బెన్ స్టోక్స్ ఐదో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే.. జోష్ హేజిల్‌వుడ్ డకెట్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత జానీ బెయిర్‌స్టో(10)తో కలిసిన స్టోక్స్ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
వీరోచిత సెంచరీ కొట్టిన బెన్ స్టోక్స్(155)
ఈ క్రమంలోనే అతను హ్యాట్రిక్ సిక్స్‌లు కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా స్టోక్స్ తన మార్క్ షాట్లతో చెలరేగి ఆడాడు. అయితే.. ప్రమాదరకరగా మారుతున్న అతడిని జోష్ హేజిల్‌వుడ్ ఔట్ చేశాడు. దాంతో, ఇంగ్లండ్ ఓటమి ఖరారైంది. జోష్ టంగ్(19) చివరి వికెట్‌గా వెనుదిరిగడంతో ఆసీస్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్(110) సెంచరీ బాదడంతో ఆసీస్ 414 రన్స్ కొట్టింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ను 325కే కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కమిన్స్ సేన 279 పరుగులకు ఆలౌటయ్యింది. రికార్డు లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 327 పరుగుల వద్ద పది వికెట్లు కోల్పోయింది.