Suryakumar Yadav : టీమిండియాలో ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఒక నయా సంచలనం. టీ 20 వరల్డ్ కప్, న్యూజిలాండ్ సిరీస్‌లో విధ్యంసక ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్య టీ20ల్లో వరల్డ్ నంబర్ 1 స్థానానికి ఎగబాకాడు. అయితే.. టీ20ల్లో అగ్రస్థానానికి చేరుకోవడం అనేది ఇప్పటికీ అంతా కలలా ఉందని అతను అంటున్నాడు. టీ20ల్లో తన సక్సెస్ గురించి పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. టీ 20ల్లో నంబర్ 1 బ్యాటర్‌గా నిలవడం అనేది ఇప్పటికీ అంతా కలలానే ఉంది. నువ్వు టీ 20ల్లో టాప్ ప్లేయర్ అవుతావని ఒక ఏడాది క్రితం ఎవరైనా నాతో అంటే ఎలా స్పందించేవాడినో. నేను ఈ ఫార్మాట్లో అడుగుపెట్టినప్పుడు ఉత్తమంగా ఆడాలనుకున్నా. అందుకోసం బాగా కష్టపడ్డాను అని సూర్య చెప్పాడు. వచ్చే ఏడాది స్వదేశంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడం మీద సూర్య దృష్టి పెట్టాడు.
అంతేకాదు స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టమని సూర్య అన్నాడు. రోహిత్ శర్మ తనకు పెద్దన్న లాంటి వాడని సూర్య తెలిపాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అదరగొట్టిన సూర్య జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. 2021లో భారత టీ20 జెర్సీ వేసుకున్న సూర్య తన మార్క్ షాట్లతో అలరించాడు. సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడుతూ టీమిండియాలో తన ప్లేస్ శాశ్వతం చేసుకున్నాడు. ఈ ఏడాది వెయ్యి పరుగులు చేసిన భారత ఆటగాడిగా సూర్య గుర్తింపు సాధించాడు. అంతేకాదు రెండు సెంచరీలు కొట్టాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో189.68 స్ట్రైక్ రేటుతో 239 రన్స్ చేశాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు.