మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 30: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం వేదికగా జరిగిన 43వ రాష్ట్ర స్థాయి జూనియర్ ఖోఖో టోర్నీలో ఆదిలాబాద్ దుమ్మురేపింది. మూడు రోజుల పాటు హోరాహోరీగా సాగిన చాంపియన్‌షిప్‌లో బాలబాలికల విభాగాల్లో ఆదిలాబాద్ టైటిళ్లు సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన బాలుర ఫైనల్లో ఆదిలాబాద్ 42-40 తేడాతో రంగారెడ్డిపై ఉత్కంఠ విజయం సాధించింది.
బాలికల తుదిపోరులో ఆదిలాబాద్ 18-16తో నల్లగొండపై గెలిచి టైటిల్ ముద్దాడింది. బాలుర విభాగంలో వరంగల్, మెదక్, బాలికల్లో హైదరాబాద్, రంగారెడ్డి మూడు, నాలుగు స్థానాలు దక్కించుకున్నాయి. పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, జిల్లా ఖోఖో సంఘం అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, ప్రధాన కార్యదర్శి విలియం, లక్ష్మణ్, నర్సింహారెడ్డి, కురుమూర్తిగౌడ్, బాలరాజు పాల్గొన్నారు.