న్యూఢిల్లీ: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ గెలుపు జోరు కొనసాగిస్తున్నది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ టైటిల్ దిశగా అడుగులు వేస్తున్నది. బుధవారం జరిగిన మహిళల 48-51కిలోల కేటగిరీలో నిఖత్..కుల్సుమా బానో(లద్దాఖ్)పై అలవోక విజయం సాధించింది. నిఖత్ జరీన్ పవర్ఫుల్ పంచ్‌లకు ప్రత్యర్థి తట్టుకోకపోవడంతో బౌట్‌ను రిఫరీ మధ్యలోనే ఆపేశారు.
తన అనుభవాన్ని ఉపయోగిస్తూ ఈ హైదరాబాద్ అమ్మాయి కొట్టిన పంచ్‌లకు లద్దాఖ్ బాక్సర్ దగ్గర సరైన సమాధానం లేకపోయింది. మరోవైపు 45కి-48కిలోల బౌట్లో ప్రపంచ చాంపియన్ మీనాక్షి 5-0తో అన్ను(జార్ఖండ్)ను చిత్తుగా ఓడించింది. పురుషుల 50-55కిలోల విభాగంలో పవన్ బార్తల్ 3-0తో లలిత్, 70-75కిలోల కేటగిరీలో సుమిత్..కపిల్(మధ్యప్రదేశ్)పై గెలిచి ముందంజ వేశారు. 50-55కిలోల కేటగిరీలో జాదుమణిసింగ్ 5-0తో మనీశ్ రాథోడ్‌పై గెలువగా, కామన్వెల్త్ గేమ్స్ పసిడి విజేత అమిత్ పంగల్ 4-1తో క్రిష్ పాల్‌పై విజయం సాధించి తదుపరి రౌండ్లోకి ప్రవేశించాడు.
జాతీయ బాక్సింగ్ టోర్నీలో వివాదాలు కొనసాగుతున్నాయి. బుధవారం జరిగిన రెండు ఘటనలు టోర్నీకి మరిన్ని ఇబ్బందులు తీసుకొచ్చాయి. పురుషుల 75కిలోల బౌట్లో ఆల్ఇండియా పోలీస్ బాక్సర్ మోహిత్..ఆర్ఎస్సీబీ బాక్సర్ ఇష్మిత్ను కొరకడం వివాదంగా మారింది. బౌట్ రెండో రౌండ్లో మోహిత్..ఇష్మిత్ను లక్ష్యంగా చేసుకుంటూ కొరికాడు. దీనిపై రైల్వేస్ బాక్సర్..రిఫరీలకు ఫిర్యాదు చేసినా బౌట్ కొనసాగించారని కోచ్ వాపోయాడు.
మరోవైపు 55కిలోల కేటగిరీలో సర్వీసెస్ బాక్సర్ పవన్ బార్తల్..లలిత్(ఏఐపీ) మధ్య బౌట్ తీవ్ర పెనుగులాటకు దారి తీసింది. రెండు రౌండ్లు ముగిసే సరికి పవన్ 3-2తో ఆధిక్యంలో ఉన్నాడు. ఓవైపు సమయం అయిపోతుందని రిఫరీలు సూచించినా..లలిత్ రింగ్‌లోకి రాకపోవడంతో బౌట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.