చెన్నై: ప్రతిష్ఠాత్మక చెస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్ విజేతగా నిలిచిన యువ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ ప్రదర్శనకు తగిన గుర్తింపు లభిస్తున్నది. టోర్నీ సుదీర్ఘ ప్రస్థానంలో విజేతగా నిలిచిన అతి పిన్న వయసు ప్లేయర్‌గా నిలిచిన గుకేశ్ సొంత రాష్ట్రం తమిళనాడు భారీ నజరానా ప్రకటించింది. ప్రపంచ చెస్ విజేతగా నిలిచిన గుకేశ్‌కు 5 కోట్లు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని సీఎం స్టాలిన్ అధికారిక ఎక్స్‌లో పేర్కొన్నారు. దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రాణించిన గుకేశ్ భవిష్యత్‌లోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
చెస్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ దక్కించుకున్న గుకేశ్ తమవాడంటే తమ వాడని అటు ఆంధప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాలు వాదించుకుంటున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా మూలలున్నా..గుకేశ్ పుట్టి, పెరిగింది చెన్నైలో. గుకేశ్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వైద్యులు. అయితే గుకేశ్ చిరస్మరణీయ విజయం నేపథ్యంలో ఏపీ, తమిళనాడుకు చెందిన ఇద్దరు సీఎంలు తామవాడేనంటూ ఎక్స్‌లో పోటీపడి సందేశాలు రాసుకురావడం చర్చనీయాంశంగా మారింది.