Kushal Mendis : శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ మెండిస్(Kushal Mendis) వికెట్లపై పడిపోయాడు. వరల్డ్ కప్‌లో భాగంగా సోమవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది. అసలేం జరిగిందంటే..? అఫ్గన్ ఇన్నింగ్స్ సమయంలో బంతిని అందుకునే క్రమంలో బ్యాలెన్స్ తప్పిన మెండిస్ అమాంతం వికెట్లపై పడిపోయాడు. ప్రస్తుతం అతడి వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన కొందరు పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ హిట్ వికెట్‌గా ఔట్ అవ్వడాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
సోమవారం పుణె వేదికగా జరిగిన కీలక పోరులో అఫ్గనిస్థాన్ చేతిలో లంక ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక.. అఫ్గన్ పేసర్ ఫజల్హక్ ఫారుఖీ ధాటికి 241పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ(58 నాటౌట్), అజ్మతుల్లా ఒమర్జాయ్(73) అర్థ శతకాలతో దుమ్మురేపగా.. అఫ్గన్ జట్టు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది.
దాంతో నాలుగు ఓటములతో మెండిస్ సేన పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. దాంతో, లంకసెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక కాబూలీ జట్టు ఐదో స్థానానికి ఎగబాకి సెమీస్ రేసులో తాను ఉన్నానంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది. రెగ్యులర్ కెప్టెన్ దసున్ షనక గాయపడడంతో మెండిస్ సారథిగా ఎంపికైన విషయం తెలిసిందే.