కౌలాలంపూర్: గత కొంతకాలంగా వరుస వైఫల్యాలతో కీలక టోర్నీలలో తొలి రౌండ్లలోనే వెనుదిరుగుతున్న ప్రపంచ మాజీ వరల్డ్ నంబర్‌వన్ కిదాంబి శ్రీకాంత్ మలేషియా మాస్టర్స్‌లో అదరగొడుతున్నాడు. క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో దుమ్మురేపిన శ్రీకాంత్.. ఈ టోర్నీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్ 23-21, 21-17తో నట్ ఎంగ్యుయెన్ (ఐర్లాండ్)ను మట్టికరిపించాడు.
శ్రీకాంత్ ముందంజ వేసినా పురుషుల సింగిల్స్ బరిలో నిలిచిన మిగతా ముగ్గురు షట్లర్లు మాత్రం ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. హెచ్ఎస్ ప్రణయ్, ఆయుష్, సతీష్ కుమార్ కరుణాకరన్ నిరాశపరిచారు. మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో-ధృవ్ కపిల 21-17, 18-21, 21-15తో లియ పలెర్మొ-జులియన్ (ఫ్రాన్స్)ను చిత్తు చేసి క్వార్టర్స్‌కు అర్హత సాధించారు.