హైదరాబాద్, ఆట ప్రతినిధి: రంజీ ఎలైట్ గ్రూప్-బీ మూడో మ్యాచ్‌లో హైదరాబాద్ గెలుపు దిశగా పయనిస్తోంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఫాలోఆన్ ఆడుతున్న పుదుచ్చేరి 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు అజయ్ రోహెర (69), శ్రీధర్‌రాజు (61)అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు.
చేతిలో 8 వికెట్లు ఉన్న పుదుచ్చేరి ఇంకా 212 పరుగుల వెనుకంజలో కొనసాగుతున్నది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 24/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన పుదుచ్చేరి 153 పరుగులకు కుప్పకూలింది. అనికేత్‌రెడ్డి (5/40) ధాటికి పుదుచ్చేరి బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అజయ్ రోహెర (27)మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. మిలింద్, రోహిత్, రక్షణ్‌రెడ్డి ఒక్కో వికెట్ తీశారు. ఇదిలా ఉంటే తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 536/8 వద్ద డిక్లేర్ చేసిన విషయం విదితమే.