కొలంబో: టీ20 ప్రపంచకప్‌నకు సహ ఆతిథ్యదేశంగా వ్యవహరిస్తున్న శ్రీలంక ఈ టోర్నీలో సూపర్-8కు దూసుకెళ్లింది. సోమవారం పల్లెకెలె మైదానంలో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదుచేసింది. ఛేదనలో లంక ఓపెనర్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పతుమ్ నిస్సంక (52 బంతుల్లో 100 నాటౌట్, 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఈ టోర్నీలో తొలి శతకాన్ని నమోదుచేయడంతో ఆ జట్టు స్వదేశంలో అత్యధిక ఛేదనను విజయవంతంగా పూర్తిచేసింది. అతడికి తోడు కుశాల్ మెండిస్ (38 బంతుల్లో 51, 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ట్రావిస్ హెడ్ (29 బంతుల్లో 56, 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ మిచెల్ మార్ష్ (27 బంతుల్లో 54, 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దుషాన్ హేమంత (3/37), దుష్మంత చమీర (2/36) కంగారూలను కట్టడిచేశారు. ఆసీస్‌కు ఈ టోర్నీలో ఇది వరుసగా రెండో ఓటమి కాగా ఆ జట్టు సూపర్-8 రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్టే! నేడు న్యూజిలాండ్, జింబాబ్వే జట్లు తమ ప్రత్యర్థులను ఓడిస్తే గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, గ్రూప్ డీ లో ఆఫ్ఘానిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి.
ఛేదనలో 9 రన్స్ వద్దే లంక తొలి వికెట్‌ను కోల్పోయినా ఎz్కడా అధైర్యపడలేదు. మూడో స్థానంలో వచ్చిన మెండిస్‌తో కలిసి నిస్సంక మెరుపులు మెరిపించాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 66 బంతుల్లోనే 97 పరుగులు జోడించి ఆతిథ్య జట్టు గెలుపునకు బాటలు వేసింది. అంతగా అనుభవం లేని ఆసీస్ బౌలింగ్ పవర్ ప్లేలో ఈ ద్వయం దీటుగా ఎదుర్కుని 61/1తో నిలిచింది. కూపర్ కనోలి బౌలింగ్‌లో రివర్స్ సీప్తో నిస్సంక కొట్టిన సిక్స్ అయితే చూసి తీరాల్సిందే. మ్యాక్స్‌వెల్ ఓవర్లో సింగిల్స్‌తో ఈ ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తిచేశారు.
కానీ రెండో స్పెల్‌లో బంతినందుకున్న స్టోయినిస్.. 13వ ఓవర్లో మెండిస్‌ను ఔట్ చేసినా అతడి స్థానంలోవచ్చిన రత్నాయకె సైతం ధాటిగా ఆడటంతో లంకేయులు లక్ష్యానికి చేరువయ్యారు. ఆఖరి 6 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 60 పరుగులు అవసరమనగా నిస్సంక జూలు విదిల్చాడు. స్టోయినిస్ ఓవర్లో రెండు బౌండరీలు, సిక్స్‌తో కలుపుకుని 20 రన్స్ రాబట్టాడు. ఎల్లీస్ 17వ ఓవర్లోనూ రెండు చూడచక్కని సిక్స్‌లతో 90లలోకి వచ్చాడు. జంపా ఓవర్లో రెండు ఫోర్లతో పాటు ఐదో బంతికి సింగిల్ తీసి ఈ టోర్నీలో తొలి శతకాన్ని సాధించడమే గాక లంక విజయాన్ని ఖాయం చేశాడు.
70/0.. పవర్ ప్లేలో ఆసీస్ స్కోరిది. ఓపెనర్లు మార్ష్, హెడ్ లంక బౌలర్లపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడటంతో ఆసీస్ స్కోరుబోర్డు రాకెట్ వేగాన్ని తలపించింది. మొదటి ఓవర్లోనే 4, 4, 6 దంచిన ఈ ద్వయం.. క్రీజులో ఉన్నంతసేపూ అదే దూకుడును కొనసాగించింది. తీక్షణ రెండో ఓవర్లోనే రెండు బౌండరీలు కొట్టిన హెడ్.. శనక నాలుగో ఓవర్లో 4, 6 సాధించాడు. తీక్షణ ఆరో ఓవర్లో మార్ష్ వరుసగా ఐదు ఫోర్లు కొట్టాడు. వెల్లలాగె ఓవర్లో సింగిల్‌తో 27 బంతుల్లోనే హెడ్ అర్ధ శతకం పూర్తయింది. వీరి జోరు చూస్తే కంగారూలు సులువుగానే 220+ స్కోరు చేస్తారని భావించారంతా! హేమంత 8వ ఓవర్లో రెండో బంతిని హెడ్ సిక్స్‌గా మలిచి ఆసీస్‌ను వంద పరుగుల మైలురాయిని దాటించాడు.
కానీ ఆ మరుసటి బంతికే లాంగాఫ్‌లో కమిందు మెండిస్‌కు క్యాచ్ ఇవ్వడంతో 104 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాతి ఓవర్లోనే వెల్లలాగె బౌలింగ్‌లో గ్రీన్ (3) స్టంపౌట్ అవగా హాఫ్ సెంచరీ అనంతరం మార్ష్‌ను హేమంత వికెట్ల ముందు బలిగొన్నాడు. ప్రమాదకర టిమ్ డేవిడ్‌ను కమిందు, మ్యాక్స్‌వెల్ (22)ను హేమంత, ఇంగ్లిస్‌ను చమీర ఔట్ చేయడంతో ఆసీస్ భారీ స్కోరు ఆశలకు గండిపడింది.
1టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక తరఫున నిస్సంక(100*) అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.
ఆస్ట్రేలియా: 20 ఓవర్లకు 181 ఆలౌట్ (హెడ్ 56, మార్ష్ 54, హేమంత 3/37, చమీర 2/36);
శ్రీలంక: 18 ఓవర్లకు 184/2 (నిస్సంక 100*, మెండిస్ 51, స్టోయినిస్ 2/46)