కొలంబో: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆడబోమని పాకిస్థాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలంక(Srilanka) క్రికెట్ బోర్డు ఓ విన్నపం చేసింది. ఫిబ్రవరి 15వ తేదీన జరిగే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసే అంశంపై పునరాలోచన చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డును కోరింది. పీసీబీ, ఐసీసీ మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో .. పాకిస్థాన్‌కు శ్రీలంక ఓ లేఖ రాసింది. ఆ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయవద్దు అని, షెడ్యూల్ ప్రకారం ఆ మ్యాచ్ ఆడాలని కోరింది. శ్రీలంక వేదికగా జరిగే అన్ని మ్యాచ్‌లకు కమర్షియల్, ఆపరేషనల్, లాజిస్టికల్, సెక్యూర్టీ ఏర్పాట్లు జరిగాయని, హాస్పిటాలిటీ, ప్లానింగ్, టికెట్ల అమ్మకం కూడా జరిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు.
2009లో లాహోర్‌లో అటాక్ జరిగిన తర్వాత పాకిస్తాన్లో తామే మొదటిసారి టూరు చేసినట్లు శ్రీలంక గుర్తు చేసింది. ఆ ఏడాది మార్చిలో శ్రీలంక జట్టుపై అటాక్ జరిగింది, ఆ ఘటన తర్వాత చాన్నాళ్లూ పాకిస్థాన్‌లో ఏ క్రికెట్ జట్టు పర్యటన చేయలేదు. 2025లో కూడా ఇస్లామాబాద్‌లో సూసైడ్ బాంబు దాడి జరిగిన తర్వాత కొందరు ప్లేయర్లు వెనక్కి వెళ్లాలనుకున్నారని, కానీ టూరును పూర్తి చేసేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు కట్టుబడి ఉందని ఆ లేఖలో తెలిపారు.
చాలా సున్నితమైన, సవాళ్లతో కూడిన పరిస్థితులు పాకిస్థాన్‌లో ఉన్నా.. అనేక సార్లు శ్రీలంక జట్టు ఆ దేశంలో పర్యటించినట్లు లేఖలో పేర్కొన్నారు. 2009లో లంక ప్లేయర్ల కాన్వాయ్‌పై జరిగిన దాడిలో కొందరు ప్లేయర్లు, ఆఫీషియల్స్ గాయపడిన విషయం శ్రీలంక తన లేఖలో పేర్కొన్నది. విపత్కర పరిస్థితుల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు పలుమార్లు అండగా నిలిచామని, ప్రస్తుత దశలో పాకిస్థాన్ కూడా తన ప్రణాళికను మార్చుకుని ఇండియాతో గ్రూపు స్టేజ్ మ్యాచ్ ఆడాలని లంక తన లేఖలో పాక్‌ను కోరింది.