హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): అబద్ధాలను సైతం అందంగా చెప్పి, నమ్మించడంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆరితేరారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివాదం ఏదైనా దాన్ని తన రాజకీయ అవసరాలకు వాడుకోవడం ఆయనకు పరిపాటిగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందుకు రెండు రోజులుగా గ్లోబరీనా సంస్థపై, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేస్తున్న విమర్శలను ఉదాహరణగా చూపుతున్నారు. కొడంగల్‌లో బుధవారం నిర్వహించిన ధర్నాలో గ్లోబరీనాకు కేటీఆర్‌కు లింకు పెడుతూ సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో గురువారం నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లోనూ అవే ఆరోపణలు చేశారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు ఢిల్లీలో ఉద్యమిస్తుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడ కొడంగల్ గల్లీలో గ్లోబరీనా సంస్థపై విమర్శలు చేశారు. సంబంధంలేని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. గ్లోబరీనాకు, మాజీ మంత్రి కేటీఆర్‌కు లంకె పెడుతూ సంకుచిత వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీకేజీకి, గ్లోబరీనాకు, కేటీఆర్‌కు ఒకదానితో మరొకదానికి ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ సీఎం వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై బురదజల్లాలి, ప్రజల్లో అసత్యాలను ప్రచారం చేయాలి అనే సంకుచిత రాజకీయాలకు నిదర్శనమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బదనాం చేయాలనే బురదచల్లుడు
సీఎం రేవంత్‌రెడ్డి .. తన స్థాయిని మరచి టార్గెట్ కేటీఆర్‌గా పనిచేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్‌ను బదనాం చేయడమే లక్ష్యంగా సత్యాలు, అసత్యాలతో సంబంధం లేకుండా విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వివాదం ఏదైనా, ఎక్కడ జరిగినా దాన్ని అటు, ఇటు తిప్పి కేటీఆర్‌కు లింకు పెడుతున్నారని, బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేటీఆర్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇది సీఎం రేవంత్‌రెడ్డికి ఏ మాత్రం మింగుడుపడటం లేదు. అందుకే కేటీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారని, ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీసేలా, ప్రజల్లో ఆయన పరువుకు భంగం కలిగే చర్యలకు పాల్పడుతున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగానే బోడిగుండుకూ మోకాలికి ముడి పెట్టినట్టు నీట్ పేపర్ లీకేజీకి, గ్లోబరీనాకు, కేటీఆర్‌కు లింకు పెట్టారని విమర్శిస్తున్నారు. ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని పంపి కేటీఆర్‌పై వ్యతిరేకత పెరిగేలా కుయుక్తులకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఈ విధంగా కేటీఆర్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు.
విద్యార్థుల డిమాండ్‌కు విరుద్ధంగా..
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. వారికి సంఘీభావంగా కొడంగల్‌లో గురువారం ధర్నా చేసిన సీఎం రేవంత్‌రెడ్డి అసలు విషయం మాట్లాడకుండా ఈ వివాదాన్ని తన రాజకీయ అవసరాలకు వాడుకున్నాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడా డిమాండ్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. కానీ కేటీఆర్‌ను టార్గెట్‌గా చేసుకొని వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడో జరిగిన వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి గ్లోబరీనాకు కేటీఆర్‌కు లింకు పెట్టారు.
కేంద్రంపై మాట్లాడేందుకు భయమా?
విద్యార్థులకు మద్దతుగా ధర్నా చేసిన కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేశారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై మాట్లాడేందుకు జంకుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన పల్లెత్తు మాట కూడా అనడంలేదని, అసలు పేపర్ లీకేజీపై తీవ్రంగా స్పందించడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కొడంగల్‌లో బుధవారం చేసిన ధర్నా కూడా కాంగ్రెస్ ఆగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీల అరెస్ట్‌కు వ్యతిరేకంగా చేశారే తప్ప.. కేంద్రానికి వ్యతిరేకంగా కాదని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి జంకుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీతో సీఎం సత్సంబంధాలను నెరుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పటికైనా ఆయన బీజేపీలోకి వెళ్లేవారే అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై ఎక్కువగా విమర్శలు చేయడంలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.