హైదరాబాద్, జులై 23(నమస్తే తెలంగాణ) : నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ నేత ముఠా జయసింహతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌లో వద్ద నిరసన తెలుపనున్నట్టు తెలిపారు. కేటీఆర్ తన పుట్టినరోజు వేడుకలను పూర్తిగా రద్దు చేసుకొని ఈ ధర్నాకు హాజరవుతారని పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ప్రధాని ఇంటి వద్ద ధర్నా చేస్తుంటే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం కొడంగల్‌లో దాకొన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి పూర్తిగా మోదీ డైరెక్షన్లోనే పనిచేస్తున్నారని ఆరోపించారు.
లాఠీచార్జ్ దారుణం : గెల్లు శ్రీనివాస్
నీట్ అవకతవకలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బీజేపీ ప్రభుత్వం లాఠీచార్జ్ చేయడం దారుణమని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. రాహుల్‌గాంధీకి చిన్న దెబ్బ తగిలితే స్పందించిన రేవంత్‌రెడ్డి.. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న నీట్ లీకేజీపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఢిల్లీలో విద్యార్థులపై మోదీ ప్రభుత్వం లాఠీచార్జ్ చేస్తే, తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దిల్‌సుఖ్‌నగర్‌లోని నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేస్తున్నదని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమం రాజుకున్నదని, దీని సెగలు ప్రభుత్వాలకు తగలడం ఖాయమని బీఆర్ఎస్ నేత ముఠా జయసింహ పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు తుంగ బాలు, గోపగాని రఘురాం, పల్లా ప్రవీణ్‌రెడ్డి, శిగ వెంకటేశ్, వల్లమల కృష్ణ, కోట్ల మహిపాల్, రాజేశ్ నాయక్, యశ్వంత్ పాల్గొన్నారు.