యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ఇండియాకు.. శ్రీలంక చేతిలో పరాజయం ఎదురైంది. అనుభవలేమితో ప్రత్యర్థికి భారీ స్కోరు చేసే అవకాశం ఇచ్చిన భారత్.. ఆనక బ్యాటింగ్‌లో పోరాడినా.. గెలుపు గీత దాటలేకపోయింది. టాపార్డర్ వైఫల్యంతో ఇక కష్టమే అనుకుంటున్న దశలో సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ అనూహ్య పోరాటం చేయగా.. శివమ్ మావి మెరుపులతో మ్యాచ్ మనదే అనిపించినా.. పట్టు వదలకుండా ప్రయత్నించిన లంక సిరీస్ సమం చేసింది.
పుణె: ప్రాథమిక సూత్రాలను మరచిన టీమ్ఇండియా అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది. వరుసబెట్టి నోబాల్స్ వేసిన భారత బౌలర్లు ప్రత్యర్థికి ఇతోధిక సాయం చేయగా.. దసున్ షనక కెప్టెన్ ఇన్నింగ్స్‌తో లంకను గెలిపించాడు. గురువారం ఇక్కడ జరిగిన రెండో టీ20లో శ్రీలంక 16 పరుగుల తేడాతో టీమ్ఇండియాపై విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో భారత్ గెలుపొందగా.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కుశల్ మెండిస్ (31 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), దసున్ షనక (22 బంతుల్లో 56 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివర్లో షనక భారత బౌలర్లను చెడుగుడాడుకున్నాడు.
అతడి ధాటికి ఆఖరి మూడు ఓవర్లలో మనవాళ్లు 59 పరుగులు సమర్పించుకున్నారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3, అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ ఏకంగా ఐదు నోబాల్స్ వేస్తే.. ముగ్గురు (ఉమ్రాన్, శివమ్, అర్ష్‌దీప్) స్పెషలిస్ట్ పేసర్లు 10 ఓవర్లలో 138 పరుగులు ఇచ్చుకున్నారు. మిగిలిన పది ఓవర్లలో లంక 68 పరుగులే చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో పాండ్యా సేన 20 ఓవర్లలో8 వికెట్లు కోల్పోయి 190 పరుగులకు పరిమితమైంది. ఇషాన్ కిషన్ (2), శుభ్‌మన్ గిల్ (5), అరంగేట్ర ఆటగాడు రాహుల్ త్రిపాఠి (5), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (12), దీపక్ హుడా (9) విఫలం కాగా.. సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) పోరాడారు. ఆఖర్లో యువ ఆటగాడు శివమ్ మావి (26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడినా లాభం లేకపోయింది. లంక బౌలర్లలో మధుషనక, రజిత, షనక తలా రెండు వికెట్లు పడగొట్టారు. షనకకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
కొంపముంచిన నోబాల్స్
పోరాటంలో ఇరు జట్ల సమంగానే నిలిచినా.. నోబాల్స్ రూపంలో ఏడు అదనపు బంతులు వేసిన భారత్ పరాజయం పాలైంది. అర్ష్‌దీప్ తన తొలి ఓవర్లోనే పదే పదే గీత దాటుతూ.. ఒక్క బంతికే 14 పరుగులు సమర్పించుకున్నాడు. అతడు వరుసగా మూడు నోబాల్స్ వేయడం గమనార్హం. అనంతరం 19వ ఓవర్లో మరో రెండు నోబాల్స్ వేశాడు. ఉమ్రాన్, శివమ్ మావి కూడా ఒక్కో నోబాల్ వేయడంతో లంక అదనపు ప్రయోజనం పొందింది. ఇరు జట్ల మధ్య శనివారం రాజ్‌కోట్‌లో మూడో టీ20 జరుగనుంది.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక: 206/6 (షనక 56*, మెండిస్ 52; ఉమ్రాన్ 3/48, అక్షర్ 2/24),
భారత్: 190/8 (అక్షర్ 65, సూర్యకుమార్ 51; షనక 2/4, రజిత 2/22).