కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నది. పాక్ బౌలర్లు అబ్రార్ (4/69), నసీమ్ (3/41) సత్తాచాటడంతో లంక తొలి ఇన్నింగ్స్లో 166 పరుగులకే ఆలౌటైంది. ధనంజయ డిసిల్వ (57; 9 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో రాణించగా.. దినేశ్ చండిమాల్ (34), రమేశ్ మెండిస్ (27) పర్వాలేదనిపించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ తొలి రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. అబ్దుల్లా (74 బ్యాటింగ్), షాన్ మసూద్ (51) అర్ధశతకాలు సాధించారు. చేతిలో 8 వికెట్లు ఉన్న పాక్.. ప్రత్యర్థి స్కోరుకు 21 పరుగుల దూరంలో ఉంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టులో పాకిస్థాన్ విజయం సాధించిన విషయం తెలిసిందే.