SRH | హైదరాబాద్, ఆట ప్రతినిధి: అదనపు కాంప్లిమెంటరీ పాసుల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తమను బెదిరిస్తున్నదని, ఈ విషయంలో బీసీసీఐ తక్షణమే జోక్యం చేసుకోకుంటే తాము హైదరాబాద్‌ను వదిలివెళ్తామని సన్‌రైజర్స్ విడుదల చేసిన ఈ-మెయిల్ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంపై హెచ్‌సీఏ స్పందించింది. అసలు తమకు ఎస్ఆర్హెచ్ నుంచి ఎలాంటి ఈ-మెయిల్ రాలేదని ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కార్పొరేట్ బాక్సుల టికెట్ల విషయంలో మొదలైన రగడపై అటు ఎస్ఆర్హెచ్, ఇటు హెచ్‌సీఏ ఢీ అంటే ఢీ అనుకుంటున్నాయి. ఒప్పందం ప్రకారం ఉప్పల్ స్టేడియంలోని మొత్తం సీటింగ్ కెపాసిటీలో 10 శాతం (3,900 సీట్లు) హెచ్‌సీఏకు సన్‌రైజర్స్ ఇవ్వాల్సి ఉంది.
కాగా ప్రధానంగా స్టేడియం దక్షిణ భాగంలోని మొదటి అంతస్తులో గల ఎఫ్-12ఏ బాక్సులో కాంప్లిమెంటరీ పాసుల దగ్గరే ఇరువర్గాలు ఏకాభిప్రాయం కుదరడం లేదని వినికిడి. అసలు హెచ్‌సీఏకు ఇచ్చేవి కాకుండా ఎస్ఆర్హెచ్ ఎన్ని టికెట్లను ముద్రిస్తుంది? ఎన్నింటిని అమ్మకానికి పెడుతుంది? అనేదానిపైనా లెక్కాపత్రం లేదని తెలుస్తోంది. అదీగాక మ్యాచ్ టికెట్ ధరలనూ డిమాండ్ బట్టి ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో విధంగా నిర్ణయించడం, అటు హెచ్‌సీఏ, ఇటు ఎస్ఆర్హెచ్ సోషల్ మీడియా ఖాతాల్లోనూ టికెట్ ధరలపై సమాచారం లేకపోవడం సోషల్ మీడియాలో అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది. కొన్ని స్టాండ్లలో సామర్థ్యానికి మించి టికెట్లను విక్రయిస్తున్నారని, దీంతో టికెట్లు కొనుగోలు చేసి లోపలికి వెళ్లినవారికి అక్కడ వేరే వాళ్లు ఉండటంతో నిలబడి మ్యాచ్ చూడాల్సి వస్తుందని ఎస్ఆర్హెచ్పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా హెచ్‌సీఏ-ఎస్ఆర్హెచ్ మధ్య మొదలైన కాంప్లిమెంటరీ పాసుల వివాదం ఎటు దారితీస్తుందనేది చర్చనీయాంశమైంది.