నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : ప్రపంచంలోనే ధనిక క్రికెట్ లీగ్‌గా వెలుగొందుతున్న ఐపీఎల్‌లోకి నయా స్టార్ దూసుకొచ్చింది. దేశానికి ఎంతో మంది ప్రతిభ కల్గిన క్రికెటర్లను అందించిన ఐపీఎల్ మరోమారు తన విశిష్టతను చాటుకున్నది. ప్రతిభ ఉండే సత్తాచాటేందుకు ఐపీఎల్ అసలైన వేదిక అని నిరూపిస్తూ మరో తార తళుక్కుమంది. ప్రత్యర్థిపై విరుచుకుపడుతూ భారీ స్కోర్లు నమోదు చేస్తున్నా.. పేలవ బౌలింగ్‌తో వరుస ఓటములు చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) టీమ్‌కు తురుపుముక్క దొరికింది. ఎస్ఆర్హెచ్ గత వైభవాన్ని గుర్తుకు తెస్తూ, దిగ్గజ బౌలర్ల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ విదర్భ యంగ్ తరంగ్ ప్రఫుల్ హింగే రాకెట్లా దూసుకొచ్చాడు.
పసలేని బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు వరంగా మారిన జైదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్‌కు ఉద్వాసన పలికిన ఎస్ఆర్హెచ్..హింగేకు అవకాశమిచ్చింది. సొంత ఇలాఖా ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన హింగే సుదీర్ఘ ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఇప్పటి వరకు ఎవరికి సాధ్యం కాని అరుదైన రికార్డుతో హింగే తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్, లుహాన్ డీ ప్రిటోరియస్‌ను ఔట్ చేసి ఔరా అనిపించుకున్నాడు. ఇలా ఐపీఎల్ తొలి ఓవర్లోనే మూడు వికెట్ల తీసిన మొదటి బౌలర్‌గా హింగే కొత్త చరిత్ర లిఖించాడు. ఊరించే బౌన్సర్‌తో సూపర్ ఫామ్‌మీదున్న సూర్యవంశీని గోల్డెన్ డక్‌గా పంపించిన ఈ 24 ఏండ్ల విదర్భ సంచలనం..జురెల్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి జట్టు సంబురాల్లో ముంచెత్తాడు. ఆఖరి బంతికి ప్రిటోరియస్‌ను ఔట్ చేసి రాయల్స్ టాపార్డర్‌ను కకావికలు చేశాడు.
హింగే పదునైన పేస్ ధాటికి స్కోరుబోర్డుపై ఒక పరుగుకే రాజస్థాన్ మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అదే దూకుడు కొనసాగిస్తూ తన రెండో ఓవర్లో కెప్టెన్ పరాగ్ స్వింగ్‌తో హింగే బోల్తా కొట్టించాడు. మొత్తంగా రాయల్స్ టాపార్డర్‌కు హింగే పీడకల మిగిల్చాడు. ఇదిలా ఉంటే అసలు ఎవరీ హింగే అనే ఆసక్తి ఎస్ఆర్హెచ్ అభిమానులతో పాటు అందరిలో ఆసక్తి నెలకొన్నది. 2024 అక్టోబర్‌లో రంజీ ట్రోఫీ సీజన్ ద్వారా విదర్భ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టిన హింగే తనదైన పేస్ బౌలింగ్‌తో జట్టు విజయాల్లో కీలకమయ్యాడు. 11 ఇన్నింగ్స్‌లో 26.37 సగటుతో 16 వికెట్లు తీసి సత్తాచాటాడు.
ఐపీఎల్ అరంగేట్రానికి ముందు నిరుడు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఆడిన హింగే 23 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అయితే గతేడాది జరిగిన విదర్భ ప్రొ టీ20 లీగ్‌లో హింగే అసలు ప్రతిభ బయటకు వచ్చింది. నెకో మాస్టర్ బ్లాసర్స్ టైటిల్ గెలువడంలో హింగే కీలకంగా వ్యవహరించాడు. 12 ఏండ్ల వయసులోనే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ప్రఫుల్..తన ఆరాధ్య క్రికెటర్ ప్యాట్ కమిన్స్ అని ప్రకటించాడు. కమిన్స్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలని తన కోరిక అన్న హింగే..విదర్భకు చెందిన ఉమేశ్ యాదవ్‌ను స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఇప్పటి వరకు 10 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన హింగే 27 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఐపీఎల్ చరిత్రలోనే చిరస్మరణీయ స్పెల్‌తో హింగే కొత్త చరిత్రకు నాంది పలుకడం విశేషం.