Heinrich Klassen : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ఉతికారేసిన హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klassen) ఇప్పుడు దేశం తరఫున దంచేందుకు సిద్ధమయ్యాడు. భారీ సిక్సర్లకు కేరాఫ్ అయిన క్లాసెన్ తన ఐపీఎల్ అనుభవం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘ఐపీఎల్ యజమానులకు సిక్సర్లు బాదే ఆటగాళ్లు, మ్యాచ్ గెలిపించే వాళ్లంటేనే ఇష్టం. అందుకనే కొన్ని సార్లు క్రికెట్ మైండ్ గేమ్ అవుతుంది. సో.. ఎదుర్కొన్న మొదటి బంతి నుంచే సిక్సర్లు బాదాలని అనుకునేవాడిని’ అని క్లాసెన్ తెలిపాడు.
ఈఎస్పీఎన్ క్రికెట్‌తో మాట్లాడిన ఈ చిచ్చరపిడుగు.. ఆటగాళ్ల నుంచి ఐపీఎల్ ఓనర్లు ఏమి ఆశిస్తారు? అనేది ఫాఫ్ డూప్లెసిస్(Faf Duplesis) వివరించాడని వెల్లడించాడు. ‘నేను ఈ మధ్యే డూప్లెసిస్‌ను మీరు ఐపీఎల్లో నిలకడగా ఎలా రాణిస్తున్నారు? అని అడిగాను. అందుకు అతడు.. సిక్సర్లు కొట్టేవాళ్లను, మ్యాచ్ విన్నర్లను మాత్రమే ఐపీఎల్ యజమానులు బాగా చూసుకుంటారు అని చెప్పాడు. అందుకనే నేను బ్యాట్‌ను స్వింగ్ చేయడంపై దృష్టి పెట్టాను. సిక్సర్లు కొట్టడమే పనిగా పెట్టుకున్నా’ అని క్లాసెన్ తెలిపాడు.

ఐపీఎల్ పదిహేడో సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun risers Hyderabad) ఫైనల్ చేరడంలో క్లాసెన్ ఉన్నాడు. ఆరెంజ్ ఆర్మీ జట్టు రికార్డు స్కోర్ల వెనక ప్రశాంతంగా కనిపించే చిచ్చరపిడుగు పాత్ర ఎంతో ఉంది. స్పిన్, పేస్.. బౌలర్ ఎవరైనా బంతిని రెప్పపాటులో బౌండరీ దాటించిన క్లాసెన్ ఏకంగా 400 రన్స్ బాదాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్న క్లాసెన్ క్రికెటింగ్ జర్నీ ఆసక్తికరం. స్కూల్లో సాధారణ విద్యార్థిగా ముద్ర పడినా అతడు ఇప్పుడు తన సంచలన బ్యాటింగ్‌తో కోట్లాది మంది మనసులు గెలిచాడు.

‘చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. నిజం చెప్పాలంటే క్రికెట్ కోసమే స్కూల్‌కు వెళ్లేటోన్ని. అయితే.. మా మేడమ్ ఒక రోజు ‘క్రికెట్ నిన్ను ఎక్కడికి తీసుకెళ్లదు. చదువుపై శ్రద్ద పెట్టు’ అని గట్టిగానే చెప్పింది. కానీ నేను వింటేగా. ఆటపై ఇష్టంతో హోమ్‌వర్క్ కూడా సరిగ్గా చేసేటోన్ని కాదు. అయితే.. క్రికెటర్ అవ్వాలనే నా కలను ఎలాగోలా నిజం చేసుకున్నాను. అయినా సరే ఆ రోజు మా మేడం చెప్పిన మాటలు నా బుర్రలో అలాగే ఉండిపోయాయి. ఒక్కోసారి ఆ మాటలు తలచుకొని నవ్వుకుంటాను కూడా’ అని క్లాసెన్ వెల్లడించాడు.

క్రికెటర్‌గా ఇరగదీస్తున్న క్లాసెన్‌లో ఓ ప్రేమికుడు దాగి ఉన్నాడు. అవును మైదానంలో బౌలర్లకు చుక్కలు చూపించే అతడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాలుగేండ్లు లవ్ చేసిన సొనె మార్టిన్స్(Sone Martins)తో జీవితాన్ని పంచుకుంటున్నాడు. మార్టిన్స్ ఒక రేడియోగ్రాఫర్. ఈ జంటకు 14 నెలల వయసున్న ‘లయా’ అనే పాప ఉంది. ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌పై క్లాసెన్ వీరబాదుడు బాదుతుంటే చిన్నారి ‘లయ’ మస్త్ మురిసిపోయిందనుకో.
