IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో అంచనాలు తలకిందులవుతున్నాయి. అద్భుత విజయంతో టోర్నీని ఆరంభించిన జట్లు అనూహ్యంగా ఓటమి పాలవుతున్నాయి. టైటిల్ ఫేవరెట్లు అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాయి. కమిన్స్ కెప్టెన్సీలోని హెస్ఆర్హెచ్ , రహానే సారథ్యంలోని కేకేఈర్ పాయింట్ల పట్టికలో వరుసగా 8, 10 స్థానాల్లో నిలిచాయి.
ఇప్పటికే మూడు మ్యాచులు ఆడేసిన ఇరుజట్లు.. ఇకపై ప్రతి మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకశాలు ఉంటాయి. లేదంటే.. రేసు నుంచి వైదొలిగాల్సి రావచ్చు. 17వ సీజన్లో 287 సంచలన ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్ ఈ ఎడిషన్‌లో తేలిపోతోంది. అటు కోల్‌కతా పరిస్థితి కూడా అంతే. ఓపెనింగ్ జోడీ కుదరక.. లోయర్ ఆర్డర్ వైఫల్యంతో విజయావకాశాల్ని చేజార్చుకుంటోంది.
𝗗𝗲𝘁𝗲𝗿𝗺𝗶𝗻𝗲𝗱. 𝗙𝗼𝗰𝘂𝘀𝗲𝗱. 𝗥𝗲𝗮𝗱𝘆. 💪#PlayWithFire | #KKRvSRH | #TATAIPL2025 pic.twitter.com/GUn5kjO9f0
— SunRisers Hyderabad (@SunRisers) April 3, 2025
ఐపీఎల్లో రికార్డు బ్రేకర్ అయిన సన్‌రైజర్స్ నిరుడు 287 పరుగులతో చరిత్ర సృష్టించింది. 18వ సీజన్ తొలి పోరులోనే 286 రన్స్‌తో తమకు తామేసాటి అనిపించుకుంది ఆరెంజ్ ఆర్మీ. పవర్ ప్లేలో 10కి పైగా నెట్రన్ రేటుతో పరుగులు రాబట్టగల విధ్వసంక బ్యాటర్లు హైదరాబాద్ సొంతం. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(Travis Head), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy), అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్.. ఇలా ఐదో బ్యాటర్ వరకూ అందరూ.. రెచ్చిపోయి ఆడేవాళ్లే. అయితే.. వీళ్లు ఆడితేనే జట్టు భారీ స్కోర్ చేస్తోంది. టాపార్డర్ కుప్పకూలిందంటే ఒత్తిడిలో పడి లో స్కోర్‌కే కుప్పకూలుతోంది కమిన్స్ సేన. అనికేత్ వర్మ, హెడ్ మినహా అభిషేక్, క్లాసెన్, తొలి మ్యాచ్‌లో సెంచరీ బాదేసిన ఇషాన్.. వరుసగా విఫలమవుతున్నారు.
దూకుడే మంత్రగా చెలరేగుతూ ఆరెంజ్ ఆర్మీకి కొండంత బలం కావాల్సిన వీళ్లు జట్టుకు బలహీనత అవుతున్నారు. తమ పేలవమైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్ల ఉచ్చులో పడుతూ నిరాశపరుస్తున్నారు. గత మూడు మ్యాచుల్లో హెడ్(67, 47, 22), అనికేత్ వర్మ(7, 36, 74)లు ఫర్వాలేదనిపించగా.. ఇషాన్ ఉప్పల్‌లో 106 నాటౌట్ , ఆ తర్వాత డకౌట్, ఢిల్లీపై 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక నితీశ్ బాధ్యతగా ఆడాల్సింది పోయి వికెట్ పారేసుకుంటున్నాడు. క్లాసెన్ సైతం భారీ షాట్లు ఆడే క్రమంలో వికెట్ ఇచ్చేస్తున్నాడు.
Matchday ready 💪#PlayWithFire | #KKRvSRH | #TATAIPL2025 pic.twitter.com/F2wQ0PgWRT
— SunRisers Hyderabad (@SunRisers) April 3, 2025
ఇక బలమైన బౌలింగ్ లైనప్ లేకపోవడం హైదరాబాద్‌ను వేధిస్తోంది. సీనియర్లు షమీ, కమిన్స్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. నిఖార్సైన స్పిన్నర్ల కొరత హైదరాబాద్‌ను వేధిస్తోంది. ఆల్‌రౌండర్ అభిషేక్.. పార్ట్ టైమ్ స్పిన్నర్ మాత్రమే. అయితే.. ఢిల్లీ క్యాపిట్స్ల్స్పై అరంగేట్రం చేసిన జీషన్ అన్సారీ 3 కీలక వికెట్లతో రాణించి భావి తారగా ఆశలు రేపాడు. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లకు ముకుతాడు వేయాలంటే తుది జట్టులో లేదంటే.. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా ఈ ఈ లెగ్ స్పిన్నర్‌ను ఆడించాల్సిందే.
స్క్వాడ్ నిండా ఆల్రౌండర్స్తో కూడిన కోల్‌కతా పరిస్థితి కూడా ఆశాజనకంగా ఏమీ లేదు. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో కంగుతిన్న ఆ జట్టు రాజస్థాన్‌ను ఓడించి ఖాతా తెరిచింది. కానీ, తర్వాతి పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(Quinton deKock) రాణిస్తున్నా.. సునీల్ నరైన్ విఫలమవుతున్నాడు. కుర్రాడు అంగ్క్రిష్ రఘువంశీ వేగంగా స్కోర్ చేస్తున్నాడు. కానీ, కెప్టెన్ అజింక్యా రహానే, ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్(Andrew Russel) ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇక సిక్సర్ల కింగ్ అయిన రింకూ సింగ్ మెరుపులు కనిపంచడం లేదు. టెయిలెండర్లలో రమన్‌దీప్ సింగ్ ఒక్కడే ఒంటరిపోరాటం చేస్తున్నాడు. గత సీజన్లో రికార్డు ధర పలికిన మిచెల్ స్టార్క్, యువకెరటం సుయాశ్ శర్మను వదిలేసిన కోల్‌కతా.. బౌలింగ్‌లో పస తగ్గిపోయింది. స్పిన్ భారమంతా వరుణ్ చక్రవర్తి మోయాల్సి వస్తుంది. అతడికి సునీల్ నరైన్ నుంచి సహకారం అందడం లేదు.
The Golden Fortress of Knight Riders! 🏆⚔️💜 pic.twitter.com/iwBaHKrW1N
— KolkataKnightRiders (@KKRiders) April 3, 2025
ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లో ఒకేఒక విక్టరీ కొట్టిన హైదరాబాద్, కోల్‌కతా ఇకపై గెలుపు బాట పట్టేందుకు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. కాగితం మీద బలంగా కనిపించే హైదరాబాద్, కోల్‌కతా జట్లు.. మైదానంలో రెచ్చిపోయి ఆడితే తప్ప ప్లే ఆఫ్స్ రేసులో నిలవడం కష్టం. అందుకే.. ఈరోజు (ఏప్రిల్ 3వ తేదీన) ఈడెన్ గార్డెన్ వేదికగా ఈ రెండు టీమ్‌ల మధ్య జరుగబోయ మ్యాచ్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. రెండో విజయంతో పాయింట్ల పట్టికలో ముందంజ వేసేది ఎవరు? అనేది తేల్చే మ్యాచ్ రసవత్తరంగా జరగడం ఖాయం. రాత్రి 7:00 గంటలకు టాస్ వేయనుండగా.. 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.