Harish Rao | హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యలకు ఇది చెంపపెట్టు లాంటిది అని తెలిపారు. నిన్న పార్టీ ఫిరాయింపుల విషయంలో మొట్టికాయలు, నేడు హెచ్‌సీయూ భూముల విషయంలో సుప్రీం అక్షింతలు వేసిందన్నారు.
అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తామంటే, చట్టం చూస్తూ ఊరుకోదు అని హరీశ్‌రావు మండిపడ్డారు. పర్యావరణాన్ని కాపాడడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందినపుడు న్యాయస్థానం మార్గదర్శకంగా ఉండడం శుభ పరిణామం. ఇది విద్యార్థుల విజయం, పర్యావరణ ప్రేమికుల విజయం, సామాజిక వేత్తల విజయం. హెచ్‌సీయూ భూములు కాపాడుకునేందుకు ఎంతగానో పోరాటం చేసిన విద్యార్థులకు, తెలంగాణ సమాజానికి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు.
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టుకు పంపింది. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ చర్యలు అన్నీ నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా కోర్టు చేర్చింది. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. తమ ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించింది. ఇది చాలా తీవ్రమైన అంశం అని జస్టిస్ గవాయ్ ధర్మాసనం పేర్కొంది. అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 16న తదుపరి విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు.