ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయి క్రికెట్ ఆడకుండా నిషేధం ఎదుర్కొన్న కేరళ పేసర్ శ్రీశాంత్.. దేశీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన శ్రీశాంత్. ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. ఐపీఎల్ సందర్భంగా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనను చెంపదెబ్బ కొట్టాడని చెప్పి అప్పట్లో పెద్ద దుమారమే లేపాడు.
ఆ గొడవ చల్లారిన కొంతకాలానికే 2013లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం బయటకు వచ్చింది. దానిలో శ్రీశాంత్ కూడా పాల్గొన్నాడని అతనిపై బీసీసీఐ నిషేధం విధించింది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల 2020 సెప్టెంబరులో ఈ నిషేధాన్ని తొలగించారు. ఆ తర్వాత ప్రకటించిన కేరళ రంజీ జట్టులో శ్రీశాంత్ పేరు కూడా ఉంది. దీంతో మళ్లీ ఈ స్పీడ్‌స్టర్ పునరాగమనం చేస్తాడని అంతా అనుకున్నారు.
అయితే అనూహ్యంగా తాను అన్నిఫార్మాట్లలో దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పేస్తున్నట్లు ప్రకటించాడు. తనకు ఇంతకాలం అండగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. అలాగే బీసీసీఐ అనుమతిస్తే ప్రపంచ వ్యాప్తంగా జరిగే లీగుల్లో ఆడతానని చెప్పాడు. ఈ మేరకు ట్విట్టర్లో ఒక వీడియో షేర్ చేశాడు. క్రికెట్‌కు దూరమైన తర్వాత డ్యాన్స్, యాక్టింగ్‌పై ఫోకస్ పెట్టిన శ్రీశాంత్.. పలు హిందీ, మలయాళీ సినిమాల్లో నటించాడు. చాలా టీవీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు.
— Sreesanth (@sreesanth36) March 9, 2022