హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణాశిబిరాలు మొదలయ్యాయి. ఈ నెల 15 నుంచి మే 31 వరకు జరుగనున్న శిబిరాల్లో వివిధ క్రీడాంశాల్లో పిల్లలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నాం. భవిష్యత్తులో మెరికల్లాంటి ప్లేయర్లను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సాట్స్ ఆధ్వర్యంలో ఈసారి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నాం. దాదాపు పదివేల విద్యార్థులు సాట్స్ శిబిరాల్లో శిక్షణ తీసుకునేలా ప్రణాళిక రూపొందించాం.
రాష్ట్రంలో ప్రతిభ కల్గిన ప్లేయర్లకు కొదువలేదు. అలాంటి వారిని గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ర్టానికి మరిన్ని పతకాలు వచ్చేలా అధికారులు కృషి చేయాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సాట్స్ ఉన్నతాధికారులు, కోచ్‌లు పాల్గొన్నారు.