SATS Logo | హైదరాబాద్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): తెలంగాణలో చారిత్రక చిహ్నాల మార్పు కొనసాగుతున్నది. చారిత్రక వారసత్వానికి ప్రతిబింబంగా భావించే కాకతీయుల కళాతోరణాన్ని కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇప్పటికే రాష్ట్ర అధికారిక చిహ్నాం మార్చేందుకు ప్రయత్నించి అభాసుపాలైన ప్రభుత్వం.. తాజాగా స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(సాట్స్) లోగోను మార్చేసింది.
పాత లోగోను పూర్తిగా మార్చేస్తూ కొత్త లోగోను కాపీ, పేస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న సాట్స్ లోగోలో కాకతీయ కళాతోరణానికి తోడు ఇరువైపులా ఆయా క్రీడావిభాగాలను ప్రతిబింబిస్తూ క్లిప్ఆర్ట్స్, మధ్యలో ట్రోఫీతో చూడటానికి ఆకర్షణీయంగా కనిపించేది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం.. లోగోను ఉన్నఫళంగా మార్చేసింది. చారిత్రక ఆనవాళ్లు ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డ ప్రభుత్వం.. లోగోను కూడా నకలు కొట్టి నవ్వుల పాలైంది. ఆశాయె(రోష్ని ఉమీదోంకా)2015 లోగోను అచ్చు గుద్దినట్లు దించేసింది. ఈ లోగోను సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ క్రీడా సలహాదారు జితేందర్‌రెడ్డి, సాట్స్ చైర్మన్ శివాసేనారెడ్డి, సాట్స్ ఎండీ సోనీబాలదేవి పాల్గొన్నారు. సాట్స్ లోగో మార్పుపై క్రీడాభిమానులను పెదవి విరుస్తున్నారు. ఎలాంటి చారిత్రక ఆనవాళ్లకు ఆస్కారం లేకుండా లోగోను డిజైన్ చేయడంపై సోషల్‌మీడియాలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.