Wimbledon | లండన్: స్పెయిన్ నయా సంచలనం కార్లోస్ అల్కారజ్ వరుస విజయాల ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్‌తో మెరిసిన అల్కారజ్ తాజాగా..వింబుల్డన్‌లో ఫైనల్ పోరులోకి దూసుకెళ్లాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఈ 21 ఏండ్ల స్పెయిన్ నయాబుల్ తనకు తిరుగులేదని ఘనంగా చాటిచెప్పాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ అల్కారజ్ 6-7(1-7), 6-3, 6-4, 6-4తో మెద్వదెవ్‌పై అద్భుత విజయం సాధించాడు.
మూడు గంటల పాటు హోరాహోరీగా సాగిన పోరులో అల్కారజ్..మెద్వదెవ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మెద్వదెవ్‌కు తొలి సెట్ చేజార్చుకున్న అల్కారజ్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. కోర్టులో చిరుతను తలపిస్తూ వరుసగా మూడు సెట్లలో మ్యాచ్‌ను తన వశం చేసుకున్నాడు. ఈ క్రమంలో అల్కారజ్ 58 ఏస్‌లు కొడితే మెద్వదెవ్ 69తో ఆకట్టుకున్నాడు. మరో సెమీస్‌లో జొకోవిచ్ 6-4,7-6(7-2), 6-4 తేడాతో ముసెట్టీ (ఇటలీ)పై అలవోక విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించాడు.