Andres Iniesta : ఫుట్‌బాల్‌లో ఓ దిగ్గజ ఆటగాడి కెరీర్ ముగియనుంది. సుదీర్ఘ కాలంగా అభిమానులను అలరిస్తున్న స్పెయిన్ లెజెండ్ ఆండ్రెస్ ఇనియెస్టా(Andres Iniesta) సాకర్‌కు వీడ్కోలు పలుకనున్నాడు. ప్రపంచంలోనే మేటి మిడ్ ఫీల్డర్ అయిన ఆండ్రెస్ ఈ విషయాన్ని మంగళవారం స్వయంగా వెల్లడించాడు. అక్టోబర్ 8వ తేదీన తాను వీడ్కోలు ప్రకటన చేస్తున్నానని అభిమానులకు తెలిపాడు.
తన జెర్సీ నంబర్ 8 కావడంతో.. అదే రోజున ఆటకు అల్విదా చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు సోషల్ మీడియా వీడియో ద్వారా ఆండ్రెస్ వెల్లడించాడు. ఈ వీడియోకు త్వరలోనే మీ ముందుకు రాబోతున్నా 08.10.24 అనే క్యాప్షన్‌తో ఫుట్‌బాల్ స్టార్ పెట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
COMING SOON🔜8️⃣🔟2️⃣4️⃣ pic.twitter.com/H0eaSKkTwU
— Andrés Iniesta (@andresiniesta8) October 1, 2024
స్పెయిన్ గొప్ప ఫుట్‌బాలర్ అయిన సభ్యుడైన ఆండ్రెస్ ఇనియెస్టా వరల్డ్ కప్ గెలుపొందాడు. రెండు పర్యాయాలు యూరో చాంపియన్‌షిప్(2008, 2012) సాధించిన జట్టులో అతడు భాగమయ్యాడు. ఇప్పటివరకూ ఈ మిడ్‌ఫీల్డర్ 131 మ్యాచుల్లో 13 గోల్స్ కొట్టాడు. పరోక్షంగా 30 గోల్స్ చేయడంలో సహచరులకు సాయపడ్డాడు. ఇక బార్సిలోనా క్లబ్ తరఫున 674 మ్యాచులు ఆడిన ఆండ్రెస్.. 57 గోల్స్ కొట్టడమే కాదు 135 గోల్స్‌కు సాయం చేశాడు. తన సుదీర్ఘ కెరీర్లో అతడు మూడు వరల్డ్ కప్‌లు ఆడాడు.