Asif Hossain : భారత క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. బెంగాల్‌కు చెందిన క్రికెటర్ అసిఫ్ హొసేన్ (Asif Hossain) అనుకోకుండా దుర్మరణం చెందాడు. సొంత ఇంటి మెట్ల పైనుంచి ప్రమాదవశాత్తూ కింద పడిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. 28 ఏండ్ల వయసులోనే ఆసిఫ్ ఈ లోకాన్ని వీడడం పట్ల బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌తో పాటు పలువురిని షాక్‌కు గురి చేసింది. అసిఫ్ మరణవార్త తెలిసిన క్రికెటర్లు అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
ఏం జరిగిందంటే.. బెంగాల్‌లోని ఇంట్లో అసిఫ్ సోమవారం మెట్ల పైనుంచి జారి కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అయితే.. అప్పటికే అసిఫ్ మరణించాడని వైద్యులు చెప్పారు. చెట్టంత కొడుకు కండ్ల ముందే కన్నుమూయడంతో అసిఫ్ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తమ కుమారుడికి ఎలాంటి అనారోగ్యం లేదని, అనుకోని ప్రమాదం అతడిని బలిగొన్నదని వాళ్లు లబోదిబోమంటున్నారు.
দুচোখে ছিল রঞ্জির স্বপ্ন, মাত্র ২৮ বছরেই না ফেরার দেশে বাংলার প্রতিভাবান ক্রিকেটারের…#BengalCricket #RanjiTrophy #cricketerhttps://t.co/SYbFxQEA6s pic.twitter.com/NGewT63TOm
— zee24ghanta (@Zee24Ghanta) October 1, 2024
దేశవాళీలో నిలకడగా రాణించిన అసిఫ్ బెంగాల్ టీ20 లీగ్‌లోనూ దంచి కొట్టాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన అతడు 37 బంతుల్లోనే అర్ధ శతకంతో చెలరేగాడు. ఓ మ్యాచ్‌లో 99 పరుగులతో సత్తా చాటిన అతడు సీనియర్ జట్టుకు ఆడడంపై దృష్టి పెట్టాడు. కానీ, అనుకోకుండా అసిఫ్ మృత్యుఒడికి చేరడం తమను ఎంతో బాధిస్తోందని సహచరులు అంటున్నారు. క్రికెటర్ అవ్వడం కోసం అహర్నిశలు శ్రమించి.. ఉజ్వల భవిష్యత్తును ఊహించిన అతడి అకాల మరణం పట్ల బెంగాల్ క్రికెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.