GST Collection | సెప్టెంబర్ నెలలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు రూ.1.73లక్షలకోట్లు వసూలయ్యాయి. వసూళ్లలో 6.5శాతం వార్షిక వృద్ధి నమోదైంది. గతేడాది సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 1.62లక్షల కోట్లు వసూలయ్యాయి. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం గణాంకాలను విడుదల చేసింది. సెప్టెంబర్లో సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐటీఎస్టీ, సెస్ అన్నీ ఏడాది ప్రాతిపదికన పెరిగినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. 2024లో ఇప్పటి వరకు జీఎస్టీ వసూళ్లు 9.5శాతం పెరిగి.. రూ.10.9లక్షల కోట్లకు చేరాయి.
2023 ఇదే కాలంలో రూ.9.9లక్షల కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్లో మొత్తం జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.20.18 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11.7 శాతం ఎక్కువ. మార్చి 2024తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ వసూళ్లు రూ. 1.68 లక్షల కోట్లుగా రికార్డయ్యాయి. గత ఏడాది సగటు రూ. 1.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ.