Paris Olympics : ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ పోటీల ఆరంభం రోజే ప్రపంచ రికార్డు బద్ధలైంది. ఆర్చరీ ర్యాంకింగ్స్ రౌండ్లో దక్షిణ కొరియా యువకెరటం లిమ్ సిహైయన్ (Lim Sihyeon) చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత ఆర్చరీ విభాగంలో ఐదేండ్ల రికార్డు బ్రేక్ చేసింది. గురువారం జరిగిన పోటీల్లో 21 ఏండ్ల లిమ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 694 పాయింట్లు సాధించింది.
దాంతో, 2019లో దక్షిణ కొరియాకే చెందిన కాంగ్ చీయంగ్ (KANG Chaeyoung) నెలకొల్పిన రికార్డును ఈ టీనేజర్ బద్ధలు కొట్టేసింది. ఆ ఏడాది జూలై నెలలో చీయంగ్ 692 పాయింట్లతో పుస్తకాల్లోకి ఎక్కింది. వరల్డ్ నంబర్ 2 అయిన లిమ్ సిహైయన్ ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉంది. హుండాయ్ ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2లో రెండు బంగారు పతకాలు సాధించి ప్రకంపనలు సృష్టించింది.
లిమ్ సిహైయన్

ఆ తర్వాత షాంఘైలో 60 పాయింట్లతో స్వర్ణ పతకం ఎగరేసుకుపోయింది. నిరుడు ఆసియా క్రీడ(Asian Games 2022)ల్లోనూ లమ్ తన గురికి తిరుగులేదని చాటుతూ పసిడి వెలుగులు విరజిమ్మింది. తాజాగా ఒలింపిక్స్ ర్యాంకింగ్స్ రౌండ్లో అత్యుత్తమ ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. వ్యక్తిగత విభాగంలో ఈ యంగ్‌స్టర్ గోల్డ్ మెడల్‌కు గట్టి పోటీదారుగా మారింది.