ముల్లాన్‌పూర్: భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి పోరులో ఎదురైన ఓటమికి దక్షిణాఫ్రికా బదులు తీర్చుకుంది. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆ జట్టు 51 పరుగుల తేడాతో మెన్ ఇన్ బ్లూను ఓడించి జయభేరి మోగించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 214 పరుగుల రికార్డు ఛేదనలో టీమ్ఇండియా.. 19.1 ఓవర్లలో 162 రన్స్‌కే ఆలౌట్ అయింది. టాపార్డర్ విఫలమవగా తిలక్ వర్మ (34 బంతుల్లో 62, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) పోరాడినా అతడికి అండగా నిలిచేవారు లేకపోవడంతో ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పలేదు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. క్వింటన్ డికాక్ (46 బంతుల్లో 90, 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో నిర్ణీత ఓవర్లలో 213/4 పరుగుల భారీ స్కోరుచేసింది. భారత పేసర్లు అర్ష్‌దీప్, బుమ్రా దారుణంగా విఫలమైనా వరుణ్ చక్రవర్తి (2/29) ఫర్వాలేదనిపించాడు. డికాక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 ఈనెల 14న ధర్మశాలలో జరుగుతుంది.
ఇటీవలే పరిమిత ఓవర్ల ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చిన డికాక్.. టీ20ల్లో రెండు డకౌట్ల తర్వాత తన విలువను చాటే ఇన్నింగ్స్‌ను ఆడాడు. ఆరంభం నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన డికాక్ క్రీజులో ఉన్నంతసేపు సఫారీ స్కోరు రాకెట్ వేగాన్ని తలపించింది. అర్ష్‌దీప్ వేసిన తొలి ఓవర్లోనే సిక్స్‌తో పరుగుల వేటను ఆరంభించిన డికాక్.. అతడితో పాటు బుమ్రాను టార్గెట్ చేశాడు. అర్ష్‌దీప్ 3వ ఓవర్లో 4,6తో 12 రన్స్ రాబట్టిన అతడు.. బుమ్రా ఓవర్లోనూ సిక్స్ కొట్టాడు. వరుణ్ తొలి బంతికే రీజా హెండ్రిక్స్ (8)ను ఔట్ చేసినా డికాక్ జోరు తగ్గలేదు. హార్ధిక్ 9వ ఓవర్లో బౌండరీతో 26 బంతుల్లోనే అతడి హాఫ్ సెంచరీ పూర్తయింది.
11వ ఓవర్లో అర్ష్‌దీప్ ఏకంగా ఏడు వైడ్లు వేయడంతో పాటు మొత్తంగా 18 రన్స్ ఇచ్చాడు. మార్క్మ్ (29).. వరుణ్ 12వ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టినా ఆఖరి బంతికి అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చాడు. శతకం దిశగా సాగుతున్న డికాక్‌ను వరుణ్ తన ఆఖరి బోల్తా కొట్టించాడు. బ్రెవిస్ (10)ను అక్షర్ పెవిలియన్‌కు పంపినా ఆఖర్లో ఫెరీరా (16 బంతుల్లో 30*, 1 ఫోర్, 3 సిక్స్‌లు) మిల్లర్ (12 బంతుల్లో 20*, 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి సఫారీలకు భారీ స్కోరు కట్టబెట్టారు.
ఛేదనలో భారత టాపార్డర్ మరోసారి నిరాశపరిచింది. మొదటి 4 ఓవర్లలోనే మూడు కీలక వికెట్లను కోల్పోయి ఛేదనను మరింత కష్టతరం చేసుకుంది. గిల్ తానెదుర్కున్న తొలి బంతికే డకౌట్ అవగా కెప్టెన్ సూర్య (5) చెత్త ఫామ్‌ను కొనసాగించాడు. రెండు సిక్సర్లు కొట్టిన అభిషేక్ (17)దీ అదేబాట! బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చిన అక్షర్ పటేల్ (21) సైతం ఆకట్టుకోలేకపోయాడు. 32 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన తిలక్.. ఆరంభంలో దూకుడుగా ఆడి 27 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తిచేశాడు. హార్ధిక్ (21) వేగంగా ఆడలేకపోయినా జితేశ్ (27), తిలక్ పోరాడారు. అయితే ఆఖరి 3 ఓవర్లలో 72 రన్స్ కావాల్సి ఉండటంతో ఛేదన కష్టమేనని తేలిపోయింది. వేగంగా ఆడే క్రమంలో జితేశ్ నిష్క్రమించడంతో భారత ఓటమి ఖరారైంది.
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 213/4 (డికాక్ 90, ఫెరీరా 30, వరుణ్ 2/29, అక్షర్ 1/27);
భారత్: 19.1 ఓవర్లలో 162 (తిలక్ 62, జితేశ్ 27, బార్ట్‌మన్ 4/24, యాన్సెన్ 2/25)