IPL | ఢిల్లీ: వారం రోజుల వాయిదా అనంతరం మరో మూడు రోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్-18లో విదేశీ ఆటగాళ్ల రాకపై అనిశ్చితి కొనసాగుతున్నది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం తాజా సీజన్ మే 25కే ముగియాల్సి ఉండగా తాజాగా దానిని జూన్ 3కు పొడిగించారు. అయితే పలు దేశాల ఆటగాళ్లు తమ దేశం నుంచి మే 25 నాటికే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)ను తెచ్చుకోగా దానిని పునరుద్ధరించే అవకాశం లేదని ఆయా బోర్డులు ఇప్పటికే ఆటగాళ్లకు తేల్చిచెప్పాయి. అదీగాక తమ జాతీయ జట్టు బాధ్యతలూ వారిని సందిగ్ధంలో పడేస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ఆటగాళ్లలో చాలా మంది ఐపీఎల్‌కు తిరిగి రావడంపై అనాసక్తిగానే ఉన్నారు. ఒకవేళ వచ్చినా గ్రూప్ స్టేజ్ (మే 27) ముగియకముందే టోర్నీకి గుడ్‌బై చెప్పనున్నట్టు తెలుస్తున్నది. ఈ నిర్ణయంతో ప్లేఆఫ్స్ రేసులో ఉన్న టాప్-5 జట్ల (గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై, ఢిల్లీ)కు నష్టం తప్పకపోవచ్చునన్న ఆందోళనలో ఆయా ఫ్రాంచైజీలు ఉన్నాయి.
వచ్చే నెల 11-15 మధ్య లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగబోయే ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌తో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు షాక్ తప్పేట్టు లేదు. ఈ ఫైనల్ కోసం మంగళవారమే రెండు దేశాల బోర్డులు జట్లను కూడా ప్రకటించాయి. దక్షిణాఫ్రికా జట్టులో ఉన్న 15 మంది సభ్యులలో ఏకంగా 8 మంది ఐపీఎల్-18 ఆడుతున్నారు. రికెల్టన్, బోష్ (ముంబై), మార్క్మ్ (లక్నో), ఎంగిడి (బెంగళూరు), మల్డర్ (హైదరాబాద్), స్టబ్స్ (ఢిల్లీ), రబాడా (గుజరాత్), యాన్సెన్ (పంజాబ్) ఇది వరకే దక్షిణాఫ్రికాకు వెళ్లారు. వీరికి క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) ఇచ్చిన ఎన్వోసీ మే 25 వరకే. సీఎస్ఏ తాజా ఆదేశాల ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన ఆటగాళ్లంతా మే 31 నాటికి ఇంగ్లండ్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. దీని ప్రకారం సఫారీ ఆటగాళ్లు మే 26 లేదా 27న ఐపీఎల్-18ను వీడే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే కమిన్స్, హెడ్ (సన్‌రైజర్స్), హాజిల్‌వుడ్, డేవిడ్ (బెంగళూరు), స్టార్క్ (ఢిల్లీ), స్టోయినిస్, ఇంగ్లిస్ (పంజాబ్)లో ఎవరొస్తారనేది ఆసక్తికరం. హాజిల్‌వుడ్ గాయంతో భారత్‌కు తిరిగిరావడం అనుమానమే కాగా స్టార్క్ కూడా మళ్లీ తిరుగు ప్రయాణానికి సుముఖంగా లేడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వర్గాలు తెలిపాయి. కమిన్స్, హెడ్ త్వరలోనే హైదరాబాద్‌తో కలిసే అవకాశముంది. హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ఈ ఇద్దరూ గ్రూప్ స్టేజ్ ముగియగానే తిరుగు ప్రయాణమవుతారు.
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లలో పలువురు గ్రూప్ స్టేజ్‌కు మించి కొనసాగే అవకాశం లేదు. మే 29 నుంచి ఇంగ్లండ్.. స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. మంగళవారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ).. తమ జట్టును ప్రకటించింది. అందులో జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్), జోస్ బట్లర్ (గుజరాత్), విల్ జాక్స్ (ముంబై), జెమీ ఓవర్టన్ (చెన్నై) ఉన్నారు. బెంగళూరుకు ఆడుతున్న బెతెల్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ క్రికెటర్లూ ప్లేఆఫ్స్‌కు అందుబాటులో ఉండరు.
ప్లేఆఫ్స్ రేసులో లేనప్పటికీ చెన్నై, రాజస్థాన్, హైదరాబాద్ సైతం విదేశీ ఆటగాళ్ల రాకపై సందిగ్ధంతోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ రంగంలోకి దిగి ఆయా దేశాల క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) హేమాంగ్ అమిన్.. సీఏ, ఈసీబీ ప్రతినిధులతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.