క్రైస్ట్‌చర్చ్: అద్వితీయ ప్రదర్శనతో చెలరేగిన దక్షిణాఫ్రికా లెక్కసరి చేసింది. తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంటూ సఫారీ జట్టు రెండో మ్యాచ్‌లో 198 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో ‘డ్రా’గా ముగిసింది. 426 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ 227 పరుగులకే ఆలౌటైంది. కాన్వే (92) ఒంటరి పోరాటం చేయగా.. ఇతర ఆటగాళ్ల నుంచి అతడికి సరైన సహకారం లభించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడ, జాన్సెన్, కేశవ్ మహారాజ్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 293 పరుగులకే పరిమితమైంది. అనంతరం సఫారీ జట్టు 354/9 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి న్యూజిలాండ్ ముందు కొండంత లక్ష్యాన్ని నిలిపింది. రబడకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, హెన్రీకి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.