ACC : ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ మీడియా హక్కులను సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (SPNI) సొంతం చేసుకుంది. ఎనిమిదేండ్ల కాలానికి సోనీ టీవీ మీడియా హక్కులు దక్కించుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) వెల్లడించింది. 2024 నుంచి 2031 వరకూ సోనీ నెట్వర్క్ ఆసియా కప్ ప్రసార మాధ్యమంగా వ్యవహరించనుందని ఏసీసీ తెలిపింది. తద్వారా గతంలో కంటే 70 శాతం అదనపు ఆదాయం ఏసీసీకి సమకూరనుంది.
ఆసియా కప్ మీడియా హక్కుల కోసం దుబాయ్‌లో గతవారం జరిగిన బిడ్డింగ్ ప్రక్రియలో జియో స్టార్(Jio Star), సోనీ నెట్‌వర్క్‌లు పోటీపడ్డాయి. చివరకు జియో స్టార్ వైదొలిగింది. దాంతో, సోనీ నెట్వర్క్ మాత్రమే బిడ్డింగ్‌లో నిలిచింది. రూ.14 వేల కోట్ల కనీస ధరకు ఆసియా కప్ మీడియా హక్కుల్ని సోనీ సంస్థ హస్తగతం చేసుకుంది.
The Asian Cricket Council proudly announces its partnership with @SonySportsNetwk, granting them exclusive media rights for all ACC Asia Cup tournaments from 2024 to 2031.
Click here for more info: https://t.co/m8tAQwBU12#ACC pic.twitter.com/5MFg24xImF
— AsianCricketCouncil (@ACCMedia1) November 22, 2024
‘పురుషుల, మహిళల ఆసియా కప్ మ్యాచులతో పాటు పురుషుల, మహిళల అండర్-19 ఆసియా కప్ ప్రసార హక్కుల్నీ సోనీ టీవీకి కట్టబెట్టాం. మహిళల, పురుషుల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ పోటీలు కూడా సోనీ నెట్‌వర్క్‌లో టెలీకాస్ట్ కానున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చరిత్రలో ఈ ఒప్పందం ఓ మైలురాయి. ఆసియా దేశాల్లోని యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ఈ టోర్నీ ఎంతగానో ఉపయోగపడుతోంది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా మా మీడియా భాగస్వామిగా మారడంతో అభిమానులకు ప్రపంచస్థాయి మ్యాచ్‌ల అనుభూతిని కలిగిస్తామనే నమ్మకం మాకుంది’ అని ఆసియా క్రికెట్ కౌన్సిల్ వివరించింది.