బెంగళూరు: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా టీమ్ కెప్టెన్‌గా భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఎంపికయ్యింది. ఈ ఏడాది నుంచి కొత్తగా విమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభం కానుండటంతో.. ఇప్పటికే ఐదు ఫ్రాంచైజీలు ఏర్పడి వేలంలో ప్లేయర్స్‌ను కొనుగోలు చేశాయి. ఈ వేలంలో స్మృతి మంధాన అత్యధికంగా రూ.3.40 కోట్ల ధర పలికింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ వేలంలో ఆమెను దక్కించుకుంది.
ఈ క్రమంలో ఆర్సీబీ.. స్మృతి మంధానాను తమ జట్టు కెప్టెన్‌గా ఎన్నుకుంది. ‘మా టీమ్‌లో స్మృతి మంధాన చాలా ముఖ్యమైన ప్లేయర్. అందుకే తాము ఆమెకు జట్టు నాయకత్వ బాధ్యతలను అప్పగించాం. స్మృతి ఆర్సీబీని ఉన్నత శిఖరాలను తీసుకెళ్తుందని బలంగా విశ్వసిస్తున్నాం’ అని ఆర్సీబీ చైర్మన్ ప్రత్మేశ్ మిశ్రా ప్రకటించారు. ఈ ప్రకటనపై స్మృతి మంధాన మాట్లాడుతూ.. ‘ఆర్సీబీ కెప్టెన్‌గా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆర్సీబీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లిసిస్ ఆర్సీబీని అద్భుతంగా లీడ్ చేశారు. నేను కూడా అభిమానుల ప్రోత్సాహంతో డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ జట్టును విజయవంతంగా నడిపేందుకు 100 శాతం కృషి చేస్తా’ అని చెప్పింది.
కాగా, భారత అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టులో గత దశాబ్దకాలంగా స్మృతి మంధాన కీలకపాత్ర పోషిస్తున్నది. ఇప్పటివరకు తన కెరీర్ 113 మహిళా అంతర్జాతీయ టీ20 క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన మంధాన 27.15 సగటు, 123.19 స్ట్రైక్ రేట్‌తో 2,661 పరుగులు చేసింది.