SLC : శ్రీలంక క్రికెట్ బోర్డును భారీ ఆదాయంపై కన్నేసింది. ప్రపంచవ్యాప్తంగా మీడియా హక్కులను రికార్డు ధరకు అమ్మడం కోసం బిడ్డర్స్‌ను ఆహ్వానించింది. టెండర్ దక్కించుకున్న సంస్థలకు నాలుగేళ్ల కాలానికి మీడియా హక్కులు కట్టబెట్టనుంది. మీడియా హక్కుల ధరను వంద కోట్ల నుంచి రెండొందల కోట్ల (23 అమెరికన్ డాలర్లు – 25 అమెరికన్ డాలర్లు) మధ్య నిర్ణయించింది.
అయితే.. బిడ్డర్స్ సంఖ్యను బట్టి టెండరు ధర రూ.200 కోట్లు దాటే అవకాశం ఉంది. మార్చి 1వ తేదీన కొలంబోలో బిడ్డర్స్ పేర్లు ప్రకటించనుంది. ఒకవేళ మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపిస్తే సమయాన్ని పొడిగించనున్నట్టు శ్రీలంక క్రికెట్ తెలిపింది.
ఇప్పటికే టీమిండియా గ్లోబల్ మీడియా రైట్స్ సొంతం చేసుకున్న సోనీ స్పోర్ట్స్ ఈ రేసులో ముందుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌తో పాటు డిజిటల్ యాప్ ఫ్యాన్ కోడ్, మహిళల ప్రీమియర్ లీగ్ మీడియా హక్కులు దక్కించుకున్న వైకోమ్ 18 సంస్థలు కూడా పోటీలో ఉన్నాయి. టెండర్ దక్కించుకున్న సంస్థ 2023 ఏప్రిల్ నుంచి 2027 మార్చి వరకు శ్రీలంక జట్టు మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. 2024 జూలైలో భారత్, శ్రీలంక జట్లు ఆరు మ్యాచ్‌లు ఆడనున్నాయి. వీటిలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఉన్నాయి. 2026లో శ్రీలంక పర్యటనలో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో శ్రీలంక (53.33 పాయింట్లతో) మూడో స్థానంలో ఉంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు దాదాపు ఖరారు చేసుకుంది. 64.06 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింఇ. ఆస్ట్రేలియా జట్టు 66.67 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.