జల్వా దిఖా... సిరాజ్

లక్ష్యం జాతీయ జట్టుకు ఆడటం. ఈ ప్రయాణంలో ఎన్ని అవరోధాలు, అడ్డంకులు. అయినా గమ్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించలేదు. ఆటుపోట్లకు ఎదురీదుతూ కష్టాల కడలిని దాటుకుంటూ తన కలల ప్రయాణంలో మరో మజిలీకి చేరాడు మన హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్. ఆట కోసం అన్నీ తానై నిలిచిన తండ్రి అనంతలోకాలకు వెళ్లినా..ఆ కుర్రాడి ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. తాను ఎంతగానో ప్రేమించే వ్యక్తి కడచూపునకు దూరమైనా.. భారత్‌కు ఆడాలన్న కాంక్ష ముందుకు నడిపించింది. దుఃఖాన్ని దిగమింగుకుంటూ సహచరుల మద్దతుతో తొలిసారి టెస్టుల్లో టీమ్ఇండియా తరఫున సిరాజ్ అరంగేట్రం చేయబోతున్నాడు. ఆటో డ్రైవర్ కొడుకుగా అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానాన్ని ప్రారంభించిన సిరాజ్..ఆస్ట్రేలియాపై కీలక సమరానికి సై అంటున్నాడు.
‘మేరా బేటా దేశ్ కా నామ్ రోషన్ కరేగా’అని తన తండ్రి చెప్పిన మాటలను మనసులో ముద్రించుకున్న సిరాజ్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. గల్లీ క్రికెట్లో టెన్నిస్ బంతితో బుల్లెట్‌లాంటి బౌన్సర్లు విసిరిన ఈ హైదరాబాదీ.. ఆసీస్ గడ్డపై కంగారూలకు ఇన్స్వింగర్ల రుచి చూపించేందుకు అస్త్రశస్ర్తాలతో సిద్ధమయ్యాడు. ఐపీఎల్ ప్రదర్శన స్ఫూర్తితో బాక్సింగ్ డే టెస్టులో సత్తాచాటేందుకు సిరాజ్ ఉవ్విళ్లూరుతున్నాడు. మెల్బోర్న్లో తన పేస్ పవర్ చూపిస్తూ అజర్, లక్ష్మణ్ తరహాలో సుదీర్ఘ కాలం పాటు జాతీయ జట్టుకు సేవలందించాలని మనసారా ఆశిస్తూ సిరాజ్ ప్రస్థానంపై ప్రత్యేక కథనం..
బంతి చేతబట్టినప్పటి నుంచి సిరాజ్ కన్న కల ఇన్నాళ్లకు నిజమైంది. సుదీర్ఘ ఫార్మాట్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఎదురుచూస్తున్న ఈ హైదరాబాదీ ఎట్టకేలకు భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. యూఏఈ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్లో బెంగళూరు తరఫున దుమ్మురేపిన సిరాజ్ ఆసీస్ పర్యటనకు ఎంపికైనా.. అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. బుమ్రా, షమీ, ఉమేశ్ అందుబాటులో ఉండటంతో సిరాజ్‌కు అవకాశం కష్టమే అనుకున్నారు. అయితే అడిలైడ్ టెస్టులో షమీ గాయపడటంతో అతడి స్థానంలో సిరాజ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
అభిమాన బౌలర్ ప్లేస్‌లో..
అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించక ముందు.. ‘స్టార్క్, షమీ నా అభిమాన బౌలర్లు’అని చెప్పిన సిరాజ్.. ఈ రోజు అదే షమీ స్థానంలో జట్టులోకి రావడంతో పాటు స్టార్క్‌కు బంతులు విసరనున్నాడు. క్లబ్‌లు, రంజీలు, ఫ్రాంచైజీలు ఇలా ఎన్ని మ్యాచ్‌లు ఆడినా తెలుపు రంగు దుస్తుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం అనేది ఏ క్రీడాకారుడికైన అత్యంత ఉద్వేగభరిత క్షణం. సిరాజ్ విషయానికి వస్తే అది మరింత భావోద్వేగ పూరితం. టెస్టు సిరీస్‌కు ఎంపికై ఆసీస్ వెళ్లిన అనంతరం.. ఊపిరితిత్తల వ్యాధితో బాధపడుతున్న సిరాజ్ తండ్రి మహమ్మద్ గౌస్ (53) మృతిచెందారు. ఈ క్షణంలో మరో ఆటగాడైతే జట్టును వీడి తండ్రిని కడసారి చూసేందుకు వచ్చేవాడు కానీ ఈ స్పీడ్‌స్టర్ మాత్రం జాతీయ విధే ముఖ్యమని అక్కడే ఉండిపోయాడు.
తండ్రి మాటల స్ఫూర్తితోనే..
‘మేరా బేటా దేశ్ కా నామ్ రోషన్ కరేగా’అని తండ్రి తరచూ చెప్పే మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చిన సిరాజ్.. ఆసీస్ గడ్డపై సత్తాచాటి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలనుకుంటున్నాడు. ఆసీస్ పర్యటన కోసం ప్రకటించిన (అక్టోబర్ 26) జట్టులో తన పేరు ఉండటంతో తండ్రికి ఫోన్ చేసిన సిరాజ్.. ‘అబ్బూ మై టెస్ట్ టీమ్ మే సెలెక్ట్ హోగయా. సిరీస్ ఖేల్నే ఆస్ట్రేలియా జా రాహా హూన్'(నాన్నా.. నేను టెస్టు జట్టుకు ఎంపికయ్యా. సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్తున్నా) అని ఆనందంగా చెప్పాడు. అయితే తుదిజట్టులో చోటు దక్కించుకునే సమయానికి మాత్రం సిరాజ్ తండ్రి గౌస్ కానరాని లోకాలకు చేరిపోయారు.దుఃఖాన్ని దిగమింగి..నవంబర్ 20న భారత జట్టు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తండ్రి చనిపోయిన వార్త సిరాజ్‌కు చేరింది. ఊహించని ఉత్పాతంతో ఒక్కసారిగా కుప్పకూలిన సిరాజ్.. తండ్రిని చూసేందుకు స్వదేశానికి వెళ్లేందుకు కూడా నిరాకరించాడు. క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో స్వదేశానికి వస్తే.. తిరిగి ఆస్ట్రేలియా చేరడం కష్టం కావడంతో బీసీసీఐ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడు. ఈ కష్ట కాలంలో కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి అతడికి అండగా నిలిచారు. ఇటు కుటుంబ సభ్యులు కూడా నీ తండ్రి ఆశయాన్ని నెరవేర్చడమే ముఖ్యం అని చెప్పడంతో దుఃఖాన్ని దిగమింగి ఆసీస్‌లోనే ఉండిపోయాడు. ఈ కసినంతా మెల్బోర్న్లో బంతుల రూపంలో ప్రదర్శించాలని అతడికి ఆల్ ది బెస్ట్ చెబుదాం!
నాన్న స్వర్గం నుంచి చూస్తాడు
‘సిరాజ్ భారత టెస్టు జట్టులో ఉండాలని అబ్బూ కోరుకునేవారు. ఈ రోజు ఆయన స్వర్గం నుంచి ఇది చూసి చాలా ఆనందిస్తుంటారు. సిరాజ్‌కు ఇది దేవుడిచ్చిన అవకాశం. అబ్బూ చనిపోయారని తెలియగానే ఆసీస్‌లో ఉన్న సిరాజ్ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. అతడి ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లింది. కెప్టెన్, కోచ్ అండతో కోలుకోగలిగాడు. దేశానికి పేరు తేవాలని అబ్బూ ఎప్పుడూ అంటుండేవారు. సిరాజ్ దేశం తరఫున ఆడితే ఆయన చాలా ఆనంద పడేవారు. ఇప్పుడు స్వర్గంలో సంతోషిస్తుంటారు’
- ఇస్మాయిల్, సిరాజ్ సోదరుడు
తాజావార్తలు
- రాష్ర్టంలో కరోనా టీకా తీసుకున్న తొలి మహిళ ఈమెనే
- చనిపోయిన పెంపుడు శునకానికి ఎంత గొప్ప సంస్కారం..!
- రష్యా ఎస్-400 మిస్సైల్ కొనుగోళ్లపై అభ్యంతరం
- లాక్‌డౌన్‌తో ప్రాణాలను కాపాడుకున్నాం : ప్రధాని మోదీ
- తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
- కరోనా ఖతం.. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోదీ
- దేశంలో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు
- రాష్ర్టంలో కొత్తగా 249 కరోనా కేసులు
- రోహిత్ శర్మ ఔట్.. ఇండియా 62-2
- హార్ధిక్ పాండ్యా తండ్రి కన్నుమూత..