భారత క్రికెట్లో నూతన అధ్యాయానికి అడుగులు పడ్డాయి. దిగ్గజ క్రికెటర్లు రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన వేళ టీమ్ఇండియా కొత్త కలను సంతరించుకుంది. అందరూ ఊహించినట్లుగానే డాషింగ్ క్రికెటర్ శుభ్మన్గిల్కు భారత టెస్టు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ బీసీసీఐ..గిల్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సమరానికి జట్టును ఎంపిక చేసిన బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రిషబ్ పంత్‌కు వైస్‌కెప్టెన్సీ ఇచ్చిన బోర్డు..ఫిట్నెస్, బాధ్యతలు దృష్టిలో పెట్టుకుని బుమ్రాను పక్కకు పెట్టింది. షమీ, సర్ఫరాజ్‌ఖాన్‌కు చుక్కెదురు కాగా కరుణ్నాయర్, సాయి సుదర్శన్, అర్ష్‌దీప్‌సింగ్ జట్టుకు ఎంపికయ్యారు.
Team India | ముంబై: భారత క్రికెట్లో నవ శకానికి నాంది పడింది. పరివర్తనలో భాగంగా దేశ క్రికెట్ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని యువ క్రికెటర్ శుభ్‌మన్‌గిల్‌ను టెస్టు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. శనివారం ఇక్కడ బోర్డు ప్రధాన కార్యాలయంలో సమావేశమైన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవలే రిటైర్మెంట్ తీసుకున్న హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ వారసునిగా శుభ్‌మన్ గిల్‌ను టీమ్ఇండియా కెప్టెన్‌గా ఎంపిక చేసింది. గిల్‌కు డిప్యూటీగా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు.
వచ్చే నెల 20 నుంచి ఇంగ్లండ్‌తో మొదలుకానున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం బోర్డు 18 మందితో కూడిన టీమ్ఇండియాను ప్రకటించింది. దిగ్గజ క్రికెటర్లు రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ ఇటీవలే టెస్టులకు వీడ్కోలు పలికిన వేళ వారి స్థానాల్లో సాయి సుదర్శన్, కరణ్నాయర్ను తీసుకున్నట్లు అగార్కర్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.
దేశ క్రికెట్‌కు ఎనలేని సేవలందించిన వారి స్థానాలను భర్తీ చేయడం కష్టమేనన్న అగర్కార్ ఈ అవకాశాన్ని యువ క్రికెటర్లు అందిపుచ్చుకోవాలని సూచించాడు. జట్టు విషయానికొస్తే ఐపీఎల్ కాకుండా దేశవాళీ ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటూ సుదర్శన్‌ను జట్టులోకి తీసుకున్నామని అగర్కార్ స్పష్టం చేశాడు. సరిగ్గా ఎనిమిదేండ్ల తర్వాత కరుణ్ నాయర్ తిరిగి టీమ్ఇండియాకు ఎంపిక కాగా, ముంబై యువ బ్యాటర్ సర్ఫరాజ్‌ఖాన్‌కు చుక్కెదురైంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన సర్ఫరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఇన్నాళ్లు కోహ్లీ ఆడిన కీలకమైన నాలుగో స్థానంలో ఎవరిని ఆడించాలనే దానిపై ఇంకా అస్పష్టత నెలకొన్నది. ఈ విషయంలో కెప్టెన్ గిల్, కోచ్ గంభీర్, టీమ్ మేనేజ్మెంట్ కలిసి నిర్ణయం తీసుకుంటారని అగర్కార్ స్పష్టం చేశాడు. దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న అభిమన్యు ఈశ్వరన్‌కు జట్టులో చోటు దక్కగా, ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి తన స్థానాన్ని కాపాడుకున్నాడు.
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీని ఎంపిక చేయలేదు. వన్డే ప్రపంచకప్‌లో గాయపడి ఇటీవలే ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చిన షమీ టెస్టుల్లో ఆడే పూర్తి ఫిట్నెస్ అందుకోనట్లు అగార్కర్ తెలిపాడు. ‘గత వారం షమీ గాయపడ్డాడు. గాయం తీవ్రత తెలుసుకునేందుకు ఎమ్ఆర్ఐ స్కానింగ్ కూడా తీశారు. టెస్టులు ఆడే ఫిట్నెస్ అతనికి లేదని తెలుస్తున్నది’ అని అన్నాడు. స్టార్ పేసర్ బుమ్రా ఐదు టెస్టులు ఆడటం కష్టమేనన్న అగార్కర్ అతని వర్క్‌లోడ్ పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నాడు.
పేస్ దళానికి బుమ్రా నాయకత్వం వహించనుండగా, సిరాజ్, అర్ష్‌దీప్‌సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్‌దీప్ పేసర్లుగా కొనసాగనున్నారు. ఆసీస్‌తో సిరీస్‌లో ఆడిన హర్షిత్ రానాను సెలెక్టర్లు పక్కకు పెట్టారు. జడేజా, కుల్దీప్, సుందర్ స్పిన్నర్లుగా కొనసాగనుండగా, శార్దుల్ ఠాకూర్‌ను పేస్ ఆల్‌రౌండర్‌గా ఎంపిక చేశారు.
జట్టు వివరాలు: గిల్(కెప్టెన్), పంత్(వైస్ కెప్టెన్), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్‌రెడ్డి, జడేజా, జురెల్, సుందర్, శార్దుల్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్‌దీప్, అర్ష్‌దీప్‌సింగ్, కుల్దీప్యాదవ్.
14.66 ఇంగ్లండ్‌లో టెస్టుల్లో గిల్ బ్యాటింగ్ సగటు ఇది.
5 పిన్న వయసులో భారత కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఐదో క్రికెటర్‌గా గిల్(25 ఏండ్లు) నిలిచాడు. అలీఖాన్ పటౌడీ(21), సచిన్(23), కపిల్‌దేవ్(24), రవిశాస్త్రి(25) ముందు వరుసలో ఉన్నారు.