ముంబై: ఆస్ట్రేలియా పర్యటనకు త్వరలో వెళ్లనున్న భారత జట్టులో సెలక్టర్లు మాజీ సారథి రోహిత్ శర్మను కెప్టెన్‌గా తప్పించి ఆ పగ్గాలను శుభ్‌మన్ గిల్‌కు అందజేశారు. అయితే ఉన్నఫళంగా రోహిత్‌ను తప్పించడంపై అతడి అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకుల్లోనూ బిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కానీ హిట్‌మ్యాన్ గనుక ఈ ఫార్మాట్లో సారథిగా కొనసాగితే అది జట్టుకు మంచిదికాదని.. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్న టీమ్‌కు ఇది చేటు చేస్తుందని బీసీసీఐ భావిస్తునట్టు తెలుస్తున్నది. జాతీయ మీడియాలో వచ్చిన ఓ కథనం ప్రకారం.. ‘రోహిత్ స్థాయి వ్యక్తి నాయకుడి పాత్రలో ఉంటే అతడు డ్రెస్సింగ్ రూమ్‌లో తన మార్కు ఫిలాసఫీతో జట్టును ప్రోత్సహిస్తాడు. కానీ అతడు వన్డేల్లో మాత్రమే ఆడుతాడు.
రోహిత్ ఆడేవీ చాలా తక్కువ మ్యాచ్‌లు. ఇది జట్టు సంస్కృతిని దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు. ఒకరే సారథిగా ఉంటే డ్రెస్సింగ్ రూమ్‌లో సానుకూల వాతావరణం ఉంటుంది’ అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పారు. కాగా టెస్టులు, టీ20లకు గుడ్‌బై చెప్పిన రోహిత్.. వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనే లక్ష్యంతో ఉన్నప్పటికీ వయసు, ఫామ్ కారణంగా అప్పటిదాకా హిట్‌మ్యాన్ జట్టులో ఉంటాడా? ఉండడా? అన్నదీ అనుమానమే. కానీ బీసీసీఐ మాత్రం ప్రపంచకప్‌నకు ఇప్పట్నుంచే జట్టును సంసిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది.
గిల్‌కు వన్డే సారథ్య బాధ్యతలు అప్పగించిందీ అందుకేనని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పకనే చెప్పాడు. ఇప్పటికే టెస్టుల్లో తనదైన ముద్ర వేస్తున్న గిల్‌కు వన్డేల్లోనూ తన మార్కును చూపించేందుకు బోర్డు అతడికి చేయగలిగినంతా చేస్తున్నది. టీ20ల్లోనూ అతడిని సూర్యకుమార్‌కు డిప్యూటీగా నియమించి త్వరలోనే మూడు ఫార్మాట్లలోనూ పగ్గాలు అందజేసేందుకు సిద్ధమవుతున్నది.
హెడ్‌కోచ్ గంభీర్ సైతం ఈ నిర్ణయం (గిల్‌కు కెప్టెన్సీ) వెనుక ఉన్నట్టు తెలుస్తున్నది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో దారుణ పరాభవం తర్వాత టీమ్‌ను మొత్తం తన అధీనంలోకి తీసుకున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. భారత జట్టులో ఫార్మాట్‌కు ఒక కెప్టెన్ ఫార్ములా సెట్ కాదని గట్టిగా విశ్వసిస్తున్న బోర్డు.. ఈ క్రమంలో రోహిత్‌ను వన్డే సారథిగా కొనసాగించి జట్టు సంస్కృతిని దెబ్బతీయడం ఇష్టం లేకే హిట్‌మ్యాన్‌ను తప్పించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.